నవ ఆవిష్కరణలకు వేదిక.. పాలీటెక్ ఫెస్ట్ అని ఏపీ సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ గణేష్ కుమార్ తెలిపారు. పాలిటెక్ ఫెస్ట్‌లో విద్యార్థులు తమ ప్రతిభను కనబరుస్తున్నారని అన్నారు. పాలిటెక్ ఫెస్ట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ ఆధ్వర్యంలో ఇవాళ(సోమవారం) పాలిటెక్ ఫెస్ట్ జరిగింది. ఈ కార్యక్రమాన్ని సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ గణేష్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పాలిటెక్ లోగోను గణేష్ కుమార్ ఆవిష్కరించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రాజెక్టులను గణేష్ కుమార్ పరిశీలించారు.ఈ సందర్భంగా సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ గణేష్ కుమార్ మాట్లాడుతూ... 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందని గుర్తుచేశారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఫ్లాగ్‌షిప్ ఈవెంట్ నిర్వహిస్తున్నామని అన్నారు. చివరగా, రాష్ట్ర స్థాయి సమావేశంలో ఇక్కడ ప్రదర్శించడానికి 107 పాలిటెక్నిక్‌ల నుంచి 249 ప్రాజెక్ట్‌లు ఎంపిక చేశామని తెలిపారు. పాలిటెక్ ఫెస్ట్ ఈ ప్రోగ్రాం లక్ష్యం విద్యార్థుల సృజనాత్మకత, వినూత్న ఆలోచనలను సపోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని డిప్లొమా విద్యార్థులకు వారి సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఇది గొప్ప అవకాశామని తెలిపారు. డిప్లొమా విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్ట్‌లను చూసి వారికి బహుమతులను అందజేస్తామని చెప్పారు. పాలిటెక్నిక్‌లలో డిప్లొమా విద్యపై అవగాహన, సైన్స్ అండ్ టెక్నాలజీ పురోగతిపై అవగాహన కల్పించడంలో ఈ కాన్సెప్ట్ సహాయపడుతుందని గణేష్ కుమార్ పేర్కొన్నారు.