చోడవరం పట్టణంలో రైతు బజారు నిర్మాణం ఫిబ్రవరి నాటికి పూర్తి చేసి రైతులకు, వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు వస్తామని ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు తెలిపారు. ఇక్కడ అసంపూర్తిగా వున్న రైతు బజారు భవనాల నిర్మాణ పనులను ఆయన ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతు బజారు నిర్మాణం పూర్తికి అవసరమైన నిధులు మంజూరు అయ్యాయని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయిస్తామని చెప్పారు. ఫిబ్రవరినాటికి అందుబాటులోకి తీసుకువచ్చి రైతులకు, చిరువ్యాపారులకు దుకాణాలు కేటాయిస్తామన్నారు. దీనిని మోడల్ రైతు బజారుగా తీర్చిదిద్దుతామన్నారు. పట్టణంలో పంచాయతీ దుకాణాల పైభాగంలో కూడా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించే ఆలోచన ఉందని తెలిపారు. ఆయన వెంట టీడీపీ పట్టణ అధ్యక్షుడు దేవరపల్లి వెంకట అప్పారావు, పప్పు శ్రీనివాసరావు, మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.