బొబ్బిలి పట్టణ ప్రజల ఇలవేల్పు శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా సోమవారం పూలంగిసేవ, మంగళవారం పుష్పయాగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బెంగళూరు, కడియం, కోల్‌కతా, చెన్నై, ఊటీ తదితర ప్రాంతాల నుంచి సుమారు 60 రకాల పూలను తెప్పించామని, పది టన్నుల పూలతో పూలంగి సేవ, ఒకటిన్నర టన్నుల పూలతో పుష్పయాగం నిర్వహిస్తామని ఎమ్మెల్యే బేబీనాయన ఆదివారం తెలిపారు. సోమవారం వేకువజామున ప్రతిరోజూ జరిగే ధనుర్మాస పూజలు అనంతరం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటన్నవరకు, మళ్లీ సాయంత్రం 4.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు పూలంగి సేవ జరుగుతుంది. భక్తుల దర్శనానికి ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేశారు. ఆలయ అనువంశికధర్మకర్తల హోదాలో ఉన్న తమ సోదరులం సైతం సాధారణ క్యూలోనే స్వామిని దర్శించుకుంటామని, మిగిలిన భక్తులందరూ ఇదే పద్ధతిలో క్రమశిక్షణ పాటించాలని ఎమ్మెల్యే హితవు పలికారు.