సినిమాలపై ప్రముఖ సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మాన్ని అవమానించేలా తీసిన సినిమాలను ప్రభుత్వం వెంటనే బహిష్కరించాలని కోరారు. విజయవాడలోని కేసరపల్లిలో ఆదివారం హైందవ శంఖారావం సభ జరిగింది. ఈ కార్యక్రమంలో అనంత శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూ ధర్మాన్ని అవమానించేలా సినిమాలు తీయడంపై అనంత శ్రీరామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల ఆత్మగౌరవం కోసం లక్షల మంది తరలివచ్చారని చెప్పారు. సినిమా అనేది వ్యాపారాత్మకమైన కళ, కళాత్మకమైన వ్యాపారం అని అన్నారు. ఈ రెండిటిని జోడించే క్రమంలో హిందూ ధర్మానికి కళంకం కలుగుతుందని చెప్పారు. జరిగే తప్పులను తాను బాహాటంగానే విమర్శిస్తున్నానని అన్నారు. సినీ రంగానికి చెందిన వాడిగా ఇప్పటివరకు సినిమాల్లో జరిగిన హైందవ ధర్మ వ్యక్తిత్వ హననం సమాజానికి చెబుతున్నానని అనంత శ్రీరామ్ అన్నారు.