అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. రాజన్న అనే రైతు పొలంలోని రెండు ఆవు దూడలపై పులి దాడి చేసి చంపేసింది. చిరుత సంచారం వార్త తెలుసుకున్న స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అయితే విషయాన్ని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించినా వారు పట్టించుకోలేదంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. చిరుతల సంచారంపై ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి స్పందన లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పొలం పనులకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరుత దాడి చేయకముందే దాన్ని పట్టుకుని తమ ప్రాణాలు రక్షించాలంటూ అటవీశాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.