మహారాష్ట్రలోని షిర్డీ సాయి బాబా దర్శనానికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు షిర్డీ సాయి దర్శనం కోసం వెళ్తుంటారు. ఇక నూతన సంవత్సరం సందర్భంగా షిర్డీ సాయిబాబా ఆలయాన్ని డిసెంబర్ 31వ తేదీ రాత్రి అంతా తెరిచే ఉంచారు. భక్తుల దర్శనం కోసం రాత్రి మొత్తం ఆలయం తెరిచే ఉంచారు. నూతన సంవత్సరం సందర్భంగా షిర్డీ సాయిబాబా సంస్థాన్ డిసెంబరు 29, 2024 నుంచి జనవరి ఒకటో తేదీ వరకూ నాలుగు రోజుల పాటు షిర్డీ మహోత్సవ్‌ను నిర్వహించింది. ఇక సాయి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ ప్రాంగణం, సాయి ధర్మశాల, భకత్నివస్థాన్‌లో షిర్డీ సాయి సంస్థాన్ 34,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో మంటపం ఏర్పాటు చేసింది.
క్లెయిమ్ ఏంటి..?
అయితే షిర్డీ సాయిబాబాకు ఇచ్చే విరాళాలు ముస్లింలు తీసుకుని వెళుతున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
"షిర్డీ సాయి జేబులో పెట్టిన హిందువుల సొమ్ము ఎక్కడికి పోతుందో మీరే చూడండి! కళ్లున్నప్పటికీ అంధుడిగా మారిన దేశంలోని ప్రతి హిందువుకు చేరేలా దీన్ని వైరల్ చేయాలా?" అంటూ ఈ వీడియో పోస్టులను షేర్ చేశారు.
అసలు నిజమేంటి?
వైరల్ వీడియోలో ముస్లిం టోపీలు ధరించిన వ్యక్తులు విరాళాల పెట్టె నుంచి నగదును తీసి గోనె సంచులలో ఉంచడం చూడొచ్చు. బస్తాల ద్వారా ఆ డబ్బులు తరలిస్తూ ఉన్నారు. అయితే వైరల్ వీడియోలో ఎలాంటి నిజం లేదు. బంగ్లాదేశ్‌లోని ఓ మసీదుకు చెందిన వీడియోను షిర్డీ సాయిబాబా ఆలయానికి చెందినదిగా ప్రచారం చేస్తున్నారు.
ఎలా తెలిసింది?
ఫ్యాక్ట్ చెకింగ్‌లో భాగంగా వైరల్ వీడియోలోని కీ ఫ్రేమ్స్ ఆధారంగా గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు কিশোরগঞ্জ ভিউস అనే ఫేస్ బుక్ పేజీకి వెళ్లింది. ఆ ఫేస్ బుక్ పేజీలో మే 6, 2023న అదే వీడియోను పోస్టు చేసినట్లు గుర్తించాం. ఆ వీడియో నిడివి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాం. అయితే వైరల్ వీడియోలోని వ్యక్తులే ఈ వీడియోలో ఉన్నట్లు గుర్తించాం.
ఇక ఈ వీడియో బంగ్లాదేశ్‌లోని కిషోర్‌గంజ్ పాగ్లా మసీదుకు సంబంధించినదిగా గుర్తించాం. కిషోర్‌గంజ్ పాగ్లా మసీదులో ఉన్న ఎనిమిది విరాళాల పెట్టెలను నాలుగు నెలల తర్వాత తెరిచినట్లుగా ఈ ఫేస్ బుక్ పోస్టులో ఉంది. అలాగే రికార్డు స్థాయిలో 5 కోట్ల 59 లక్షల 7 వేల 689 టాకా విరాళాలు వచ్చినట్లు పోస్టులో రాసుకొచ్చారు. విదేశీ నాణేలు, బంగారు ఆభరణాలు కూడా అందులో ఉన్నాయని.. ఇది లెక్కించడానికి 200 మంది దాదాపు 13 గంటలు పనిచేశారని పోస్టులో వివరించారు.
ఈ విషయాన్ని ధ్రువీకరించుకోవడానికి మేము కీవర్డ్ సెర్చ్ చేయగా.. పాగ్లా మసీదుకు భారీ విరాళాలు వస్తాయనే విషయాన్ని గుర్తించాం. దీనిపై పలు మీడియా కథనాలు గుర్తించాం. అలాగే బంగ్లా మీడియా సంస్థలకు చెందిన యూట్యూబ్ ఛానల్స్‌లో కూడా ఇదే వీడియో ఉన్నట్లు ఫ్యాక్ట్ చెకింగ్‌లో తేలింది. మరోవైపు వైరల్ వీడియోలో నిజం లేదని పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా వెల్లడించాయి. ఆ కథనాలను ఇక్కడ చూడొచ్చు.
అలసు వాస్తవం ఇది...?
కావున షిర్డీ సాయి బాబా ఆలయంలో డబ్బులు ముస్లింలు తీసుకెళ్తున్నారంటూ వైరల్ అవుతున్న వీడియోలో ఎలాంటి నిజం లేదు. ఆ వైరల్ వీడియోకు షిర్డీ సాయి బాబా ఆలయానికి ఎలాంటి సంబంధం లేదని ఫ్యాక్ట్ చెకింగ్‌లో తేలింది. బంగ్లాదేశ్‌లోని కిషోర్‌గంజ్ పాగ్లా మసీదుకు సంబంధించిన వీడియోను ఇలా షిర్డీ ఆలయానికి సంబంధించిన వీడియోగా వైరల్ చేస్తున్నారు. కావున ఇది పూర్తిగా అబద్ధమని ఫ్యాక్ట్ చెకింగ్ ద్వారా ధ్రువీకరిస్తు్న్నాం