2025 నూతన సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధిలోని నిధులను విడుదల చేసేందుకు చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ నుంచి 24 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు అంగీకరిస్తూ.. నూతన సంవత్సరంలో చంద్రబాబు తొలి సంతకం చేశారు. ఈ నిర్ణయం ద్వారా సుమారుగా 1600 మంది పేదలకు ఉపయోగం కలగనుంది. మరోవైపు ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత ఈ ఆరున్నర నెలల కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ కింద రూ.124 కోట్లు నిధులు విడుదల చేశారు. 9123 మందికి ఈ నిధులను అందించారు.
మరోవైపు నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ముఖ్యమంత్రికి అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం తర్వాత వేదమంత్రాలతో ఆశీర్వదించి.. తీర్థ ప్రసాదాలు అందజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, అన్నింటా శుభం జరగాలని కోరుకున్నట్లు చంద్రబాబు చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న తెలుగువారితో పాటుగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అందరికీ చంద్రబాబు న్యూఇయర్ విషెస్ చెప్పారు. ఈ ఏడాది అనుకున్న పనులన్నీ నెరవేరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నూతన సంవత్సరం మొదటి రోజున ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందని చంద్రబాబు అన్నారు.
కనక దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజ్ భవన్ వెళ్లారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గవర్నర్‌తో మర్యాదపూర్వక భేటీలో.. కొత్త ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాల గురించి గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు చంద్రబాబు వివరించినట్లు సమాచారం. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాల గురించి కూడా గవర్నర్ వద్ద వివరించినట్లు తెలిసింది. అనంతరం అక్కడి నుంచి టీడీపీ కేంద్ర కార్యాలయానికి నారా చంద్రబాబు నాయుడు బయల్దేరి వెళ్లారు.