అది ఒక పురాతన భవనం. ప్రధానమంత్రిగా ఎన్నికైన వారికి కేటాయించే అధికారిక నివాసం. దాదాపు వందేళ్ల చరిత్ర ఉన్న ఆ భవనంలోకి వెళ్లాలంటే మాత్రం కొత్తగా ఎన్నికైన ప్రధానమంత్రులు భయపడుతున్నారు. ఇక దానికి వందల కోట్లు ఖర్చు పెట్టి మరమ్మతులు జరిపినా.. పరిస్థితి మాత్రం మారలేదు. ప్రధానమంత్రి అధికారిక నివాసంలో దెయ్యాలు ఉన్నాయనే పుకార్లు షికార్లు చేయడంతోపాటు.. కొందరు ఆ భవనంలో తమకు ఉన్న అనుభవాలను పంచుకోవడంతో.. ఆ భయాలు మరింత పెరిగాయి. దీంతో ఎంతో చారిత్రక విశిష్ఠతకు నిలయమైన ఆ ప్రధానమంత్రి భవనాన్ని భారీగా ఖర్చు చేసి నిర్మించడం, పునర్నిర్మించడం చేసినా.. అందులో ఉండేందుకు మాత్రం కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రధానులు ఆసక్తి చూపడం లేదు. అయితే ఇంకొందరు ప్రధానమంత్రులు మాత్రం ఇవన్నీ ఉత్త మాటలే అని కొట్టిపారేస్తున్నారు. అదే జపాన్ అధికారిక ప్రధానమంత్రి నివాసం.
జపాన్ ప్రధానమంత్రిగా ఇటీవలి అక్టోబర్‌లో షిగెరు ఇషిబాని ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయనను ఒక కొత్త భయం వేధిస్తోంది. జపాన్ ప్రధానమంత్రి అధికారిక నివాసంలో దెయ్యాలు ఉన్నాయనే ప్రచారంతో ఆ ఇంట్లో అడుగు పెట్టేందుకు షిగెరు ఇషిబాని ఇష్టపడటం లేదు. అయితే ఆ భవనాన్ని 1929లో మొట్టమొదట నిర్మించారు. మొత్తం 5183 చదరపు మీటర్ల విస్తీర్ణంలో.. రాతి, ఇటుకతో నిర్మించిన 2 ఫ్లోర్లలో ఆ బిల్డింగ్‌ను కట్టించారు. ఆర్ట్ డెకో డిజైన్‌తో నిర్మించిన ఈ జపాన్ ప్రధాని నివాసం.. 20వ శతాబ్దపు మొదట్లో ఆ దేశం అభివృద్ధి వైపు మారడాన్ని సూచిస్తుంది. ఇక ఈ జపాన్ ప్రధాని నివాసం నిర్మాణం అమెరికన్ ఆర్కిటెక్ట్ ఫ్రాంక్ లాయిడ్ రైట్ రూపొందించిన ఇంపీరియల్ హోటల్ నుంచి స్ఫూర్తి పొందింది. 1923లో పూర్తి అయిన ఇంపీరియల్ హోటల్.. జపాన్‌ను తీవ్రంగా భయపెట్టి, ధ్వంసం చేసిన గ్రేట్ కాంటో భూకంపాన్ని తట్టుకుని సైతం నిలబడింది.
అయితే ఈ జపాన్ ప్రధానమంత్రి అధికారిక భవనం.. ఆ దేశ రాజకీయాల్లో అనేక కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచింది. 1932లో జపాన్‌లో చెలరేగిన తిరుగుబాటులో భాగంగా అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న సుయోషి ఇనుకై.. యంగ్ నేవీ అధికారులతో అదే భవనంలోనే హత్యకు గురయ్యారు. ఆ ఘటన జరిగిన 4 ఏళ్ల తర్వాత మరోసారి జపాన్‌లో సైనిక తిరుగుబాటు చోటు చేసుకుంది. ఆ సమయంలో అదే జపాన్ ప్రధాని భవనంలో ఐదుగురిని అతి దారుణంగా కాల్చి హత్య చేశారు. ఇప్పుడు ప్రధానిగా ఉన్న కీసుకే ఒకాడా.. ఆ బిల్డింగ్‌లోని ఒక గదిలో దాక్కుని ప్రాణాలు దక్కించుకున్నారు.
ఆ తర్వాత కొన్ని దశాబ్దాల అనంతరం 2005లో జపాన్ ప్రధాని అధికారిక నివాసమైన ఆ భవనాన్ని పునర్నిర్మించారు. ఇందుకోసం జపనీస్ ప్రభుత్వం భారీగా ఖర్చు చేసింది. 8.6 బిలియన్ యెన్‌లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా రూ.465 కోట్లు ఖర్చు చేసి దాని రూపురేఖలే పూర్తిగా మార్చేశారు. దీంతో 2005 నుంచి ఆ భవనం ప్రధానమంత్రి అధికారిక నివాసంగా కొనసాగుతోంది. అయితే ఈ భవనం క్రమంగా హాంటెడ్ హౌజ్(దెయ్యాలకు నిలయం)గా పేరు తెచ్చుకుంది. ఇక జపాన్ మాజీ ప్రధాని సుటోము హటా భార్య యుసుకో హటా 1996లో.. ఆ భవనం గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. ఆ బిల్డింగ్‌లో తాను విచిత్రమైన, అదృశ్య శక్తి ఉన్నట్లు తనకు అనిపించిందని చెప్పారు. అంతేకాకుండా ఆ బిల్డింగ్‌లోని గార్డెన్‌లో రాత్రిపూట సైనిక అధికారుల దృశ్యాలు కన్పించాయని తనకు ఆ భవనంలో ఎదురైన వింత అనుభవాలను పంచుకున్నారు. దీంతో మరోసారి ఆ భవనం గురించి పుకార్లు షికార్లు చేశాయి.
ఇక జపాన్ మరో మాజీ ప్రధాని యోషిరో మోరీ కూడా తాను ఆ భవనంలో దెయ్యాలను చూసినట్లు మాజీ ప్రధాని షింజో అబేతో చెప్పినట్లు తెలుస్తోంది. 2013లో షింజో అబే రెండోసారి ప్రధానమంత్రిగా గెలిచిన తర్వాత.. ఆ బిల్డింగ్‌లో ఉండకూడదని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆ భవనం పునర్నిర్మాణం పూర్తి కాకముందే షింటో పూజారి చేత భూతవైద్యం నిర్వహించారని.. అందులో ఏవైనా ఆత్మలు ఉంటే వాటిని తొలగించినట్లు చెప్పారు. ఇక 2012 నుంచి 2020 వరకు రెండోసారి అధికారంలోకి వచ్చి.. జపాన్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానమంత్రిగా నిలిచిన షింజో అబే.. మళ్లీ ఆ బిల్డింగ్‌లో ఉండకూడదని సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయన టోక్యోలని షిబుయా జిల్లాలోని తన సొంతిట్లో నివసించారు. ఇక షింజో అబే తర్వాత వచ్చిన యోషిహిడే సుగా కూడా ఆ భవనంలో నివసించడానికి సుముఖత చూపలేదు. డిసెంబర్ 2021లో ప్రధానమంత్రి అయిన ఫుమియో కిషిదా మాత్రం ఈ భవనంలో నివాసం ఉన్నారు. తాను రాత్రివేళల్లో చాలా బాగా నిద్రపోయానని దెయ్యాలు ఉన్నాయి అనే ఊహాగానాలను ఆయన పూర్తిగా కొట్టిపారేశారు.