యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు శివారులోని ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో ఇవాళ ఉదయం భారీ పేలుడు సంభవింవింది. ఈ ఘటటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి జనగాం జిల్లా బచ్చన్నపేట గ్రామానికి చెందిన మార్క కనకయ్య(54)గా గుర్తించారు. గాయపడిన ఏడుగుర్ని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కిమ్స్, యశోదా ఆసుపత్రులకు తరలించారు.
కార్మికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కంపెనీలో ఇవాళ ఉదయం 9:45 గంటల ప్రాంతంలో పీఆర్డీసీ బిల్డింగ్-3 లో పెల్లెట్ ఫార్ములా తయారు చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఆకస్మాత్తుగా పేలుడు సంభవించిందని కంపెనీ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ వెల్లడించారు. పేలుడు సమయంలో బిల్డింగ్‌లో మొత్తం 8 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వారిలో కనకయ్య మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం టిఫిన్ టైం కావటంతో కార్మికులంతా బయటకు రాగా.. 8 మంది మాత్రమే బిల్డింగ్‌లో ఉన్నారని దుర్గా ప్రసాద్ తెలిపారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో కార్మికులు బయటకు పరుగులు పెట్టారు. యాజమాన్యం ఎమర్జెన్సీ సైరన్‌తో కార్మికులను అప్రమత్తం చేసింది. గ్యాస్ ఎనర్జీ కావడంతో బ్లాస్ట్ జరిగి ఉంటుందని అన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
రెండు ఆటోలను ఢీకొట్టిన కారు ఇక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి అటవీ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారు డ్రైవరు అజాగ్రత్త, మితిమీరిన వేగం నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. కారు రెండు ఆటోలను ఢీకొట్టిన ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. హైదరాబాద్-మెదక్ రాష్ట్ర రహదారి(765(డీ))పై శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో నర్సాపూర్ పంచాయతీరాజ్ శాఖలో ఏఈఈగా పనిచేస్తున్న మెదక్ మండలం పేరూర్ గ్రామానికి చెందిన మనీషా, రుస్తుంపేటకు చెందిన ఐశ్వర్యలక్ష్మి(20), ఎల్లారెడ్డిగూడకు చెందిన మాలోత్ ప్రవీణ్(30), కౌడిపల్లి మండలానికి చెందిన అనసూయ(62) ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.