నిజామాబాద్ జిల్లా నవీపేటలో ముగ్గురు అమ్మాయిల మిస్సింగ్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. స్కూల్‌కు వెళ్తున్నామని ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు విద్యార్థినులు కనిపంచకుండా పోయారు. గురువారం (జనవరి 2) రోజు స్థానిక ప్రభుత్వ బాలిక ఉన్న పాఠశాలలో టెన్త్ క్లాస్ చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు ఇండ్ల నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయారు. రాత్రయినా పిల్లలు రాకపోవటంతో.. తల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్లి ఆరా తీశారు. అక్కడ లేకపోవటంతో.. ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు ఆశ్రయించారు.
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న నవీపేట పోలీసులు.. బృందాలుగా ఏర్పడి పట్టణం మొత్తం జల్లెడ పట్టారు. ఈ క్రమంలో.. ముగ్గురిలో ఓ అమ్మాయి నిజామాబాద్ బస్టాండులో పోలీసుల కంట పడింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో నిజామాబాద్ బస్టాండ్‌లో ఆ అమ్మాయి కనిపించటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. మిగితా ఇద్దరు విద్యార్థులు ఆచూకీ మాత్రం లభ్యంకాకపోవటం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. వారు ఎక్కడికి వెళ్లిన విషయం దొరికిన అమ్మాయి కూడా చెప్పలేదు. కాగా, తాజాగా ఆ ఇద్దరు అమ్మాయిల ఆచూకీ కూడా లభ్యమైంది. నిజామాబాద్ బస్టాండ్‌లో ఆ ఇద్దరు బాలికలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
స్కూలు డుమ్మా కొట్టిన బాలికలు ఫ్రీ బస్సు ఎక్కి చక్కర్లు కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఉచిత బస్సులో చక్కర్లు కొట్టాలని ముందుగానే నిర్ణయించుకున్న బాలికలు ఆధార్ కార్డులను వెంట బెట్టుకుని ఇంటి నుంచి బయల్దేరారు. స్కూల్ బ్యాగులను నవీపేటలోని తెలిసిన వారింట్లో పెట్టి.. బస్టాండ్‌లో బస్సు ఎక్కి బోధన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి మళ్లీ నవీపేట్ మీదుగా నిజామాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి కామారెడ్డికి వెళ్లి తిరిగి నిజామాబాద్‌కు వచ్చారు. అటు నుంచి నవీపేట్‌కు వెళ్లి మళ్లీ నిజామాబాద్‌కు చేరుకొని జగిత్యాలకు వెళ్లారు. తిరిగి నిజామాబాద్‌కు చేరుకున్నారు. ఈ మేరకు వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.
కాగా, స్కూల్‌కు డుమ్మా కొట్టి బస్సుల్లో తిరగటంపై స్థానికులు మండిపడుతున్నారు. తల్లిదండ్రులను, పోలీసులను టెన్షన్ పెట్టి ఈ తిరుగుళ్లేమిటని ప్రశ్నిస్తున్నారు. మరీ ఇలా తయారయ్యారేంటి తల్లీ అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండగా.. గతంలోనూ కొందరు విద్యార్థులు ఇలాగే ఇంట్లో చెప్పకుండా బస్సుల్లో జర్నీలు చేశారు. తాజాగా.. నవీపేట బాలికలు కూడా ఫ్రీ బస్ జర్నీ కోసం తల్లిదండ్రులను టెన్షన్‌కు గురి చేశారు. ఏదీ ఏమైనా బాలికలు క్షేమంగా ఇళ్లకు చేరుకోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.