ఓయో.. ఈ పేరు వింటే అందరికీ గుర్తొచ్చే విషయం ఒకటే. మేజర్లు.. అంటే పద్దెనిమిదేళ్లు నిండిన ఎవరైనా సరే ఆధార్ కార్డ్ చూపించి రూమ్ బుక్ చేసుకోవచ్చు. ప్రేమ జంటలు ఏకాంతంగా గడిపేందుకు ఓయో చక్కటి అవకాశంగా మారింది. ఏమైందో ఏమోగానీ కొత్త ఏడాదిలో ఓయో ఓ కొత్త రూల్ తెచ్చింది. ఇప్పటివరకు రూమ్ బుక్ చేసుకునే జంటలకు పెళ్లి అయిందా కాలేదా అనే విషయం ఓయో పట్టించుకోలేదు. ఇద్దరూ మేజర్లు అయితే చాలని భావించింది. తాజాగా దీనికి చెక్ పెట్టాలని ఓయో సీఈవో రితేశ్ అగర్వాల్ నిర్ణయించారు.ఇకపై పెళ్లికాని జంటలకు రూమ్ ఇచ్చేది లేదని బుకింగ్ సదుపాయాన్ని ఎత్తేశాడు. బుకింగ్ సమయంలోనే వివాహానికి సంబంధించి తగిన ఆధారాన్ని చూపించాలని స్పష్టం చేశారు. ఈమేరకు ఓయో చెక్ ఇన్ రూల్స్ లో మార్పులపై కంపెనీ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. మారిన రూల్స్ ప్రకారం.. ఇకపై పెళ్లికాని జంటలు రూమ్ బుక్ చేసుకునే అవకాశం లేదు.ఈ రూల్స్ తొలుత మీరట్ నుంచి ప్రారంభం కానున్నాయని, క్షేత్రస్థాయి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని మిగతా నగరాల్లోనూ అమలు చేస్తామని సీఈవో రితేశ్ అగర్వాల్ ప్రకటించారు. సురక్షితమైన, బాధ్యతాయుతమైన ఆతిథ్య పద్ధతులను అమలు చేసేందుకు ఓయో కట్టుబడి ఉంటుందని కంపెనీ తెలిపింది. కుటుంబాలు, విద్యార్థులు, ఒంటరిగా ప్రయాణం చేసేవారికి సురక్షితమైన వసతులు అందించే బ్రాండ్‌గా నిలవాలని భావిస్తున్నామని, ఇందులో భాగంగానే చెక్ ఇన్ రూల్స్ మార్చినట్లు పేర్కొంది.