చికెన్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కార్తికమాసం సందర్భంగా గతేడాది నవంబర్‌లో చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. గత నవంబర్, డిసెంబర్ నెలల్లో రూ.180 పలికిన చికెన్ ధర నేడు ఆకాశానికి నిచ్చెన వేసే దిశగా దూసుకుపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రాంతాన్ని బట్టి కేజీ చికెన్ రూ.220 నుంచి 250 వరకూ ధర పలుకుతోంది. ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.కార్తిక మాసం సందర్భంగా చాలా మంది ప్రజలు నాన్ వెజ్‌ను దూరం పెట్టగా రేట్లు పడిపోయాయి. ఆ తర్వాత వరసగా వచ్చిన క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకలతో చికెన్ రేట్లకు మళ్లీ రెక్కలు వచ్చాయి. నూతన ఏడాది సందర్భంగా నైట్ పార్టీల్లో చికెన్ విపరీతంగా వియోగిస్తుంటారు. అలాగే న్యూ ఇయర్ మెుదటి రోజు ప్రజలు పెద్దఎత్తున చికెన్ తినేందుకు ఇష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలో చికెన్ రేట్లు మళ్లీ పుంజుకున్నాయి. దీంతో నిన్న మెున్నటి వరకూ రేటు లేక ఇబ్బంది పడిన వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే చికెన్ రేట్లు పెరగడంతో ప్రజలు మాత్రం పెదవి విరిస్తున్నారు.మరోవైపు కోడిగుడ్డు ధర కొండెక్కి కూర్చుంది. గత రెండు నెలలుగా వీటి ధర పెరుగుతూనే ఉంది. ఇవాళ(ఆదివారం) ధరలను నెక్ ప్రకటించింది. హైదరాబాద్‌లో 100 కోడిగుడ్లు రూ.500 ఉండగా, వరంగల్‌లో రూ.502గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 100 కోడిగుడ్లు రూ.525, రూ.545లు పలుకుతున్నాయి. డజను గుడ్లు రూ.84లుగా ఉంది. అయితే రిటైల్ మార్కెట్‌లో ఒక్కో కోడిగుడ్డు ధర రూ.8లకు చేరువలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇది రికార్డు ధరే అని చెప్పాలి. రేటు పెరుగుదలకు ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ కోడిగుడ్డు కొనాలంటేనే పేద, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.