గత ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సర్వనాశనమైందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. రాష్ట్రంపై ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల అప్పులు మోపారని, వాటికి వడ్డీలు కట్టాలంటూ ప్రతి శుక్రవారం తనకు ఏదో ఒక బ్యాంకు నుంచి ఫోన్ వస్తోందని చెప్పారు. వైసీపీ చేసిన విధ్వంసంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుని జాగ్రత్తగా పాలన సాగించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కొంచెం సమయం తీసుకున్నా చిన్న కాంట్రాక్టర్ల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. వారి బకాయిలను మార్చిలోపు ఎంతో కొంత చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం జీతాలకు, పెన్షన్లకే సరిపోతోందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని, దీనివల్ల ఆదాయం పెరుగుతుందని, దీంతో కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించడంతో పాటు కొత్త పథకాలకు రూపకల్పన చేయవచ్చని చెప్పారు.