హౌసింగ్ ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్న మండలాల్లో ఔట్ సోర్సింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్లుగా పని చేస్తున్నవారిని ఆయా మండలాలకు ఇన్‌చార్జిలుగా నియమించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 350 మండలాల్లో హౌసింగ్ ఏఈలు లేరు. దీనిని ఆసరాగా తీసుకొని ఆయా జిల్లాల హౌసింగ్ హెడ్‌లు కనీస అర్హతలు లేనివారిని, తమ కావలసిన వ్యక్తులను నిబంధనలకు విరుద్ధంగా మండల ఇన్‌చార్జిలుగా నియమిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఈ మండల ఇన్‌చార్జి పోస్టులకు రూ.లక్షల్లో లంచాలు వసూలు చేసినట్లు ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో హౌసింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్లుగా పనిచేస్తునవారి విద్యార్హతలు, సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటూ ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్న మండలాల్లో మండల ఇన్‌ఛార్జిలుగా నియమించి, వారి సేవలను వినియోగించుకునేందుకు అనుమతి కోరుతూ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఇటీవలే అనుమతులు జారీ చేసింది.సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్, ఎంటెక్, డిప్లొమా విద్యార్హతలు ఉన్న ఔట్‌సోర్సింగ్ వర్క్‌ఇన్‌స్పెక్టర్లను మాత్రమే మండల ఇన్‌చార్జిలుగా నియమించాలనే నిబంధనలు విధించింది. అయితే కొన్ని జిల్లాల్లో హౌసింగ్ హెడ్‌లు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ కేవలం ఐటీఐ విద్యార్హత మాత్రమే ఉన్నవారిని కూడామండల ఇన్‌ఛార్జిలుగా నియమిస్తూ.. రూ.లక్షల్లో అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తుండటంతో హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రాజబాబు సీరియ్‌సగా స్పందించారు. ‘‘ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్హతలు ఉన్న ఔట్‌సోర్సింగ్ వర్క్‌ఇన్‌స్పెక్టర్లను మాత్రమే ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నచోట్ల మండల ఇన్‌చార్జిలుగా నియమించాలి. నిబంధనలను ఉల్లంఘించి నియామకాలు చేసినట్లు తేలితే అందుకు సంబంధిత జిల్లాల హౌసింగ్ హెడ్‌లు బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని హెచ్చరికలు జారీ చేస్తూ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ రాజబాబు తాజాగా సర్క్యులర్ జారీ చేశారు.