నిధుల దుర్వినియోగం ఆరోపణలతో ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి ఎన్. సంజయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యంపై విచారణ ముగిసేవరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. వైసీపీ హయాంలో సీఐడీ చీఫ్‌గా, అగ్నిమాపకశాఖ డీజీగా వ్యవహరించిన సంజయ్.. 150 ట్యాబ్‌ల సరఫరా, ‘అగ్ని’ ఎన్‌వోసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి ఒప్పందాన్ని సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్‌ఫ్రా సంస్థకు, అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై గిరిజనులు, దళితులకు అవగాహన సదస్సుల నిర్వహణ ఒప్పందాన్ని క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా అప్పగించారనే అభియోగాలు ఉన్నాయి. అంతేకాదు, మోసపూరితంగా బిల్లులు చెల్లించడం ద్వారా రూ 1.75 కోట్ల మేర నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొంటూ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలు ఉల్లంఘించి కాంట్రాక్ట్ కట్టబెట్టానన్న ఆరోపణల్లో వాస్తవం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాంట్రాక్ట్ అప్పగింత, బిల్లుల చెల్లింపు ఫైలును వివిధ దశల్లో పలువురు అధికారులు చూశారని తెలిపారు. విభాగాధిపతిగా తాను కేవలం పర్యవేక్షణ అథారిటీ మాత్రమేనని పేర్కొన్నారు. సీఐడీ చీఫ్‌గా వ్యవహరించిన సమయంలో అప్పటి విపక్ష నేతను అరెస్ట్ చేశానని, ఆ ప్రతీకారంతోనే ప్రస్తుతం తనపై కేసు పెట్టారని తెలిపారు. దర్యాప్తునకు సహకరిస్తానని, కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు.