బొబ్బిలి పరిధిలోని పారాది గ్రామానికి చెందిన నగర పోలమ్మ అనే దళిత మహిళను కులంపేరుతో దూషించి అవమానించిన వీఆర్వో అడపా గౌరీశంకర్‌ను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. శనివారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం ముందు సీపీఐ, దళిత హక్కుల పోరాట సమితి, ఎంఆర్‌పీఎస్ నాయకులు కోట అప్పన్న, గర్భాపు రమేష్, పిల్లి శంకరరావు, కన్నారావు, హరిబాబు, శంకరరావుల ఆధ్వర్యంలో నినాదాలు చేశారు. పట్టాదారు పుస్తకం అడిగిన నేరానికి దళిత మహిళను దూషించడం క్షమించరానిదన్నారు. ఆయనపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన అక్రమాస్తులపై ఏసీబీ దర్యాప్తు నిర్వహించాలని, వీఆర్వోను సస్పెండ్ చేయాలని వారంతా డిమాండ్ చేశారు.