గూడూరు ప్రాంతం ఎన్నో చారిత్రక విశేషాలకు నెలవని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ఏపీ హిస్టరీ కాంగ్రెస్ 47వ వార్షిక సమావేశాలు గూడూరు ఎస్‌కేఆర్ డిగ్రీ కళాశాలలో శనివారం ప్రారంభమయ్యాయి. ఇందులో ‘గూడూరు ప్రాంతంలోని ప్రాచీన హిందూ దేవాలయాలు’ అంశంపై నెల్లూరులోని ప్రాచీన భారతీయ భాషల విశిష్ట అధ్యయన కేంద్రం సీనియర్ ఫెలో డాక్టర్ సోమరాజుపల్లె మమత అధ్యక్షోపన్యాసం చేశారు.ప్రాచీన నాగజాతి, బోయలకు కేంద్రస్థానంగా గూడూరు నిలిచిందన్నారు. మౌర్యులకు, శాతవాహనులకు వాణిజ్య కేంద్రంగా ఉండేదన్నారు. గ్రీకు, రోమన్, చైనా దేశాలతో వ్యాపార, వాణిజ్య సంబంధాలను ఈ ప్రాంతం నెరిపిందన్నారు. దక్షిణాఫ్రికా, సింగపూర్, మలేషియాలకు వస్త్రాలను ఎగుమతి చేసిన చరిత్ర ఉందన్నారు. విందూరు చేపలు విదేశాలకు ఇక్కడి నుంచీ చేరాయన్నారు. నీలిమందు, పిచ్చిపొగాకు, వరిసాగులోనూ ఈ ప్రాంతం మొదటి స్థానంలో ఉందన్నారు. నిమ్మసాగులోనూ అగ్రగామిగా నిలిచిందన్నారు. ఆధ్యాత్మిక, కళా నైపుణ్యానికి ఈ ప్రాంతంలోని దేవాలయాలు ప్రతీకలుగా ఉన్నాయన్నారు. గూడూరులోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, కోదండరామస్వామి ఆలయం, చెన్నకేశవస్వామి ఆలయం, మూలస్థానేశ్వరస్వామి ఆలయం, భద్రకాళి-వీరభద్రస్వామి ఆలయం, శ్రీకృష్ణదాసు మఠం, తాళ్ళమ్మ ఆలయం, ఆంజనేయ ఆలయం, ధర్మరాజ ఆలయం వంటివి గొప్ప చరిత్రను కలిగి ఉన్నాయనారు.గూడూరులోని అలఘనాథ స్వామి ఆలయంలో లభించిన శాసనంలో గూడూరును కుముదంగా వ్యవహరించారనీ, కుముదం అంటే తామర పుష్పమనే అర్థం ఉందన్నారు. గూడూరు ప్రాంత చరిత్రను మరింతగా శోధించి కొత్త విషయాలను వెలికితీయవలసి ఉందన్నారు. నెల్లూరు డీకేడబ్ల్యూ కళాశాల ప్రిన్సిపాల్ గిరి మాట్లాడుతూ.. చరిత్ర నుంచీ ఈ తరం నేర్చుకోవలసింది చాలా ఉందన్నారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రీజనల్ డైరెక్టర్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. మరుగున పడిన చరిత్రను పరిశోధకులు వెలుగులోకి తీసుకురావాలన్నారు. నెల్లూరు సర్వోదయ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ కాళిదాసు పురుషోత్తం మాట్లాడుతూ.. చరిత్ర నుంచే సమాజ భవిష్యత్తు రూపొందుతుందని అభిప్రాయపడ్డారు. ఏపీ హిస్టరీ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యుడు ప్రొఫెసర్ వకుళాభరణం రామకృష్ణ మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య చరిత్రలోని బహుముఖ కోణాలపై పరిశోధనలు సాగాల్సిన అవసరముందన్నారు.భావితరాలకు చరిత్రను అందించడమే ఆంధ్రప్రదేశ్ చరిత్ర సమాఖ్య ముఖ్య లక్ష్యమని హైదరాబాదుకు చెందిన మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ డీన్ ప్రొఫెసర్ వనజ అన్నారు. అనంతరం ధర్మవరం ప్రాంతానికి చెందిన సిండే మారుతీరావు బృందం ఆధ్వర్యంలో తోలు బొమ్మలాట ప్రదర్శించారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర, స్వాతంత్య్ర ఉద్యమంలో రాయలసీమ, మాతంగి వ్యవస్థ చరిత్ర పుస్తకాలను ఆవిష్కరించారు.ఎస్వీయూ ఆర్కియాలజీ విభాగ రిటైర్డు ప్రొఫెసర్లు కిరణ్‌క్రాంత్ చౌదరి, నాగోలు కృష్ణారెడ్డి, ప్రముఖ సాహిత్యవేత్త డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, చరిత్రకారులు కొప్పర్తి వెంకటరమణ, ఇనుగంటి చంద్రమోహన్, కళాశాల ప్రిన్సిపాల్ శివప్రసాద్, స్థానిక కార్యదర్శి గోవిందు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.