ఆ విద్యార్థి డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. చెడు వ్యసనాలకు బానిసై దొంగగా మారాడు. కళాశాలకు కాకుండా రైల్వేస్టేషన్లకు వెళ్లి ఒంటరి మహిళా ప్రయాణికుల మెడలోని బంగారు ఆభరణాలను చోరీ చేసి పరారవుతున్నాడు. ఈ చోరీలపై రైల్వే పోలీసులు నిఘా పెట్టడంతో ఆ విద్యార్థి చిక్కాడు. ఆయన నుంచి 103 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను పలాసలో రైల్వే సీఐ ఎ.రవికుమార్ శనివారం విలేకరులకు వెల్లడించారు. కోటబొమ్మాళి మండలం చిన్నహరిశ్చంద్రపురం గ్రామానికి చెందిన ఈరగట్టపు రాము నరసన్నపేటలోని ఓ డిగ్రీ కళాశాలలో బీకాం చివరి సంవత్సరం చదువుతున్నాడు. చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. ఈ క్రమంలో గతేడాది నవంబరు 12న విశాఖపట్నం జిల్లా కొత్తపాలెం గ్రామానికి చెందిన పంచారి లక్ష్మి అనే మహిళ టెక్కలి నుంచి రైలులో వస్తుండగా కోటబొమ్మాళి రైల్వేస్టేషన్ వద్ద కొంతసేపు ఆగింది. వెనుకనుంచి ఆ విద్యార్థి వచ్చి ఆమె మెడలో ఉన్న 35 గ్రాముల బంగారు ఆభరణాలు తస్కరించి పరారయ్యాడు. గత నెల 13న పాతపట్నం మండలం కాగువాడ గ్రామానికి చెందిన జలుమూరు లక్ష్మి అనే మహిళ హైదరాబాద్ వెళ్లడానికి తిలారు రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ప్లాట్‌ఫాంపై రైలు కోసం ఆమె వేచిచూస్తుండగా వెనుక నుంచి విద్యార్థి వచ్చి ఆ మహిళ మెడలోని 35 గ్రాముల బంగారు ఆభరణాలు తస్కరించి ఉడాయించాడు. గత నెల 29న తిలారు రైల్వే స్టేషన్ వద్ద ఉన్న సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన సనపల భారతి మెడలోని 33 గ్రాముల బంగారు పుస్తెలతాడును తెంచుకుని మెరుపు వేగంతో పరారయ్యాడు. ఈ మూడు ఘటనలపై పలాస రైల్వే పోలీసులకు ఫిర్యాదులు అందాయి. రైల్వే ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్ ఆదేశాల మేరకు రైల్వే పోలీసులు పలాస నుంచి ఆమదాలవలస వరకూ ఉన్న రైల్వే స్టేషన్లతో పాటు రైళ్లలో కూడా నిఘా పెట్టారు. ఈ క్రమంలో శనివారం ఉదయం తిలారు రైల్వేస్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న డిగ్రీ విద్యార్థిని పట్టుకున్నారు. ఆయన్ను విచారించగా దొంగతనాల విషయం బయట పడింది. బంగారు ఆభరణాలు దొంగిలించి రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉన్న సరుగుడు తోటల్లో తలదాచుకుంటాడని, ఎవరూ లేని సమయంలో బయటకు వచ్చి మళ్లీ కళాశాలకు వెళ్లిపోవడం నిత్యకృత్యంగా పెట్టుకున్నాడని సీఐ తెలిపారు. ఆభరణాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని విశాఖపట్నం రైల్వే కోర్టులో హాజరుపరిచామన్నారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న ఎస్‌ఐ షేక్ షరీఫ్, కానిస్టేబుళ్లు టి.తులసి, ఎం.సంతోష్‌కుమార్, బి.దేవేంద్రనాథ్, శ్రీనివాసరావును సీఐ అభినందించారు.