ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఆహార భద్రతతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. పెనుకొండ, రొద్దంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంపీ బీకే పార్థసారథితో కలిసి మంత్రి సవిత ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. తద్వారా పేద విద్యార్థులకు పస్తుల బాధలు తప్పుతాయన్నారు. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, బ్యాగులు, పంపిణీ చేశామన్నారు. వైసీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి జగన.. ఐదేళ్లపాటు విద్యార్థులను పస్తులు పెట్టారన్నారు. పాఠశాలలకు వైసీపీ రంగులు వేయడంలో ఉన్న శ్రద్ధ విద్యార్థులకు భోజనం పెట్టడంలో లేదన్నారు. ఐదేళ్లపాటు భోజన పథకాన్ని నిలిపివేసి, విద్యార్థులను పస్తులు పెట్టారన్నారు. పిల్లల నోటికాడ కూడు లాగేసిన మూర్ఖుడు జగనరెడ్డి అని మండిపడ్డారు. విద్యార్థుల ఆకలిని గుర్తించిన మంత్రి నారా లోకేశ భోజన పథకాన్ని ప్రారంభించారన్నారు. అనంతరం బీకే పార్థసారథి మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేసి, పేద విద్యార్థుల కడుపు మాడ్చిందన్నారు. కూటమి ప్రభు త్వం వారి బాధలను గుర్తించి, మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిందన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి, ఎంపీ భోజనం చేశారు. ఆయా కార్యక్రమాల్లో అధికారులు, కళాశాలల సిబ్బంది పాల్గొన్నారు.