డబ్బులను వర్షంలా కురిపిస్తాం..మీ దగ్గర ఉన్న డబ్బు లను రెట్టింపు చేస్తాం.. రైస్ పుల్లింగ్ ద్వారా అధికంగా డబ్బులు సంపాదించకోవచ్చు’ అంటూ కర్నూలు జిల్లాలో కొందరు బాబాలు బురిడీ కొట్టించారు. రూ.21 లక్షలతో మోసం చేశారు. సీఐ మంజునాథ్, ఎస్‌ఐ నిరంజన్ రెడ్డి వివరాల మేరకు.. మహబూబ్ నగర్ జిల్లా శాశంపల్లి గ్రామానికి చెందిన సందుల రవి మండలంలోని హెచ్ మురవణి గ్రామానికి చెందిన వెంకటేష్ దగ్గర రూ.21 లక్షలు తీసుకొని రెట్టింపు చేస్తామని చెప్పి మోసం చేశాడు. వెంకటేష్ వారి మాయమాటలు నమ్మి రూ.21 లక్షలను ట్రంకు పెట్టెలో పెట్టాడు. తర్వాత సందుల రవి, పూజారులు కలిసి పూజకు పూనుకున్నారు. మధ్యలో ఓ వస్తువును తీసుకురమ్మని వెంకటేష్‌ను బయటకు పంపారు. ఆ సమయంలో ట్రంకు పెట్టెలోని డబ్బు న్న తీసుకొని వాటి స్థానంలో పేపర్లు పెట్టారు. పూజ అనం తరం పెట్టెను ఇక్కడే ఉంచి నదీ స్నానం చేయాల్సి ఉంటుందని నమ్మించి మంత్రాలయం వెళ్లారు. అక్కడ నదీ స్నానాలు చేశారు. నీవు ట్రంకు పెట్టెపై నదీజలాన్ని చల్లి తెరిచి చూస్తే డబ్బు రెట్టింపై ఉంటుందని చెప్పారు. నీవు ట్రంకు పెట్టెను చూసిన తర్వాత మరలా నీవు తిరిగి రావాలని చెప్పి పంపారు. దీన్ని నమ్మిన బాధితుడు వెంకటేష్ ఇంటికి వెళ్లి ట్రంకు పెట్టెను తెరిచి చూడగా పేపర్లు కనిపించాయి. అందులోని రూ.21 లక్షలు కనిపించకపోవడంతో మోసపోయానని తెలుసు కొని నిందితులు సందుల రవితోపాటు మరో నలుగురికి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని వచ్చింది. మోసపోయానని తెలుసుకొని పెద్దకడుబూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పెద్దకడు బూరు ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి విచారణ చేపట్టి నిందితుల్లో సందుల రవిని అరెస్టు చేయగా మిగతావారు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు.