ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిరుత పులుల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. కృష్ణా, అనంతరపురం జిల్లాల ప్రజలను చిరుతలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గన్నవరం మండలం మెట్లపల్లి శివారులో ఆదివారం ఉదయం పులి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది. మెట్లపల్లి సమీపంలోని ఆయిల్ పామ్ తోట వద్ద చిరుత సంచరించినట్లు ఆర్టీసీ బస్ కండక్టర్ రవికిరణ్ తెలిపారు. ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు స్థానికంగా ఉన్న కొండగట్టుపైకి వెళ్తుండగా.. అదే సమయంలో పులి తన పిల్లలతో రోడ్డు దాటుతుండడాన్ని కండక్టర్ గుర్తించాడు.చిరుత కనిపించడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన రవికిరణ్ విషయాన్ని వెంటనే ఆగిరిపల్లి పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు, అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. కండక్టర్ నుంచి పూర్తి వివరాలు సేకరించి చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నాలు మెుదలుపెట్టారు. మరోవైపు పెద్దపులి సంచరిస్తుందన్న వార్త మెట్లపల్లి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలను హడలెత్తిస్తోంది. పొలం పనులు, పక్క గ్రామాలకు వెళ్లాలన్నా సరే వణికిపోతున్నారు. ఎటువైపు నుంచి వచ్చి మీద పడుతుందోనని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు త్వరగా దాన్ని పట్టుకోవాలని కోరుతున్నారు.