స్వామి శరణం, అయ్యప్ప శరణం అంటూ మండల పరిధిలోని అంతారం గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయ పరిసరాలు అయ్యప్ప నామస్మరణతో మారుమోగాయి. గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కావాలి వెంకటేష్ బాబు, స్వరూప దంపతుల ఆధ్వర్యంలో ఆదివారం ఆంజనేయ స్వామి ఆలయ సన్నిధానంలోని అయ్యప్ప మాలధారులు ఇరుముళ్ల పడిపూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ పడిపూజను సన్నిధానం గురుస్వామి స్నేహిత్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మండలంలోని కొన్ని గ్రామాల్లో మాలధరించిన స్వాములు పడిపూజలో పాల్గొన్నారు. ఈ పడిపూజలో భాగంగా అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం, పడిపూజ చేపట్టి పడిని వెలిగించారు.
ఈ సందర్భంగా కళాబృందం ఆలపించిన భక్తిగీతాలు భక్తులను అలరించాయి. అనంతరం వెంకటేష్ బాబు అయ్యప్ప భక్తులకు, ప్రజలకు అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ బాబు మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ దైవచింతన అలవాటు చేసుకోవాలని సూచించారు. ఇరుముళ్ల పూజ అనంతరం మాలధారులు ఇరుముళ్లు కట్టుకొని శబరిమలకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అంజన్ గౌడ్, డీసీసీ ఉపాధ్యక్షులు బండారి ఆగిరెడ్డి, చేవెళ్ల పీఎసీఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాండు యాదవ్, గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.