ఆత్మకూరు కేంద్రంగా మంగళవారం నుంచి ఉమూమి తబ్లిగీ ఇజితెమాకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జనవరి 7,8,9 తేదీల్లో మూడు రోజుల పాటు జరిగే ఈ ఇజితెమా కార్యక్రమానికి కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాల నుంచి సుమారు రెండు లక్షలకు పైగా ముస్లింలు హాజరయ్యే అవకాశం వుంది. 2019 డిసెంబరులో కర్నూలు కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో ఆలమి ఇజితెమా జరిగింది. ఆ తర్వాత ఇంతటి భారీ స్థాయిలో ఆత్మకూరులో ఉమూమి తబ్లిగీ ఇజితెమా జరగడం విశేషం. కాగా మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి నెల రోజుల నుంచే భారీ ఏర్పాట్లను కొనసాగించారు. రూ.10 కోట్లతో 300 ఎకరాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో 100 ఎకరాలు ఇజితెమా వేదికగా నిర్ణయించగా మరో 200 ఎకరాలు పార్కింగ్, ఇతర సదుపాయాలకు కేటాయించారు. కాగా ఆయా రహదారుల మీదుగా వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏడు చోట్ల పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. 17 భోజన కౌంటర్లను ఏర్పాటు చేసి ఒక్కో కౌంటర్ వద్ద 10వేల మందికి భోజన సదుపాయాన్ని కల్పించారు. ప్రతిరోజు 80లక్షల లీటర్ల నీటిని అందుబాటులో ఉంచడంతో పాటు 5వేల మరుగుదొడ్లను, స్నానపు గదులను, భారీ ఫ్లడ్‌లైట్లను, చలువ పందిళ్లను సిద్ధం చేశారు. రూ.2కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయగా మిగతా మొత్తాన్ని కమిటీ సమకూర్చుకుంది.