కూటమి ప్రభుత్వం జలజీవన్ మిషన్‌పై దృష్టి సారించింది. పథకాన్ని పునర్ వ్యవస్థీకరిస్తోంది. సమగ్ర ప్రతిపాదనలు రూపొందించి కేంద్రం నుంచి మరో మూడేళ్లు అనుమతి పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. భూగర్భ జలాలను వినియోగించకుండా ప్రతి ఇంటికీ కొళాయి ద్వారా నీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించింది. ఉన్న జలాశయాల్లో ఏ ప్రాంతానికి ఎక్కడి నుంచి సరఫరా చేసే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తించి తదనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించాలని సూచించింది. దీంతో వారం రోజులుగా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని మూడు ప్రధాన జలాశయాల నుంచి 1,629 ఆవాసాలతోపాటు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరు నియోజకవర్గంలోని 202, బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని 59 హ్యాబిటేషన్లకు నీటి సరఫరాకు రూ.3,750 కోట్లు అవసరం ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో పనులు సాగక రద్దుచేసిన రూ.412 కోట్ల విలువైన 1,102 పనులను తిరిగి చేపట్టేందుకు మరో రూ.650 కోట్లు అవసరమన్న భావనకు వచ్చారు. అలా మొత్తం జలజీవన్ పథకం పునర్‌వ్యవస్థీకరణ కోసం మొత్తం రూ.4,400కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.