బొబ్బిలి పట్టణ ప్రజల ఇలవేల్పు... రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా సోమవారం పూలంగి సేవను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్తలు, రాష్ట్ర ఎఫ్‌డీసీ చైర్మన్, మాజీ మంత్రి ఆర్‌వీ సుజయ్‌కృష్ణ రంగారావు, ఎమ్మెల్యే బేబీనాయనల ఆధ్వర్యంలో పూలంగి సేవ చేశారు. ఆలయ ప్రవేశ మార్గం నుంచి లోపల మూలవిరాట్‌లు, ఉపాలయాలలో పూల సోయగాలు ఆకట్టుకున్నాయి. బెంగళూరు, కడియం, కోల్‌కత్తా, చెన్నై, ఊటీ తదితర ప్రాంతాల నుంచి సుమారు 60 రకాల పూలను తెప్పించారు. పది టన్నుల పూలతో ఆలయ పరిసరాలను, విగ్రహాలను అలంకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు అంపోలు వీరరాఘవాచార్యులు, అర్చకులు సత్యనారాయణ ఆచార్యులు, చామర్తి నరసింహాచార్యులు, భద్రం కూర్మాచార్యులు, జగదీశ్ కుమార్‌ల ఆధ్వర్యంలో పూజలు చేశారు. ఈ ఏడాది ఆలయంలో భక్తుల కోసం సింహాచలేశుని ప్రతిరూపాన్ని, కప్పస్తంభాన్ని ఏర్పాటు చేశారు. గర్భగుడి ప్రాంతంలో వివిధ రకాల పండ్లు, పూలతో అలంకరించారు. కృష్ణాపురం గ్రామానికి చెందిన భజన కళాకారులు ఉదయమంతా ఆధ్యాత్మిక గీతాలను ఆలపించారు. ఇదిలా ఉండగా... మంగళవారం ఒకటిన్నర టన్నుల పూలతో పుష్పయాగం నిర్వహిస్తామని ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు. శాస్ర్తోక్తంగా 108 బుట్టల (ఒకటిన్నర టన్నుల) పూలను కోట నుంచి తెచ్చి పుష్పయాగం నిర్వహిస్తామని చెప్పారు.