ముంబై నటి జెత్వాని కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట లభించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా అడ్వకేట్ నర్రా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. నటి జెత్వానిని వేధింపుల కేసులో నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని, ఐదుగురు నిందితులకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిందన్నారు. విచారణలో జెత్వానిని వారు తీవ్రంగా ఇబ్బంది పెట్టారని, ఈ వ్యవహారంలో నలుగురు పోలీసు అధికారులు ఉన్నారని పేర్కొన్నారు. కేసు నమోదు కంటే ముందే ఐపీఎస్ అధికారులు ముంబై వెళ్లారని, ఇలాంటి కేసులో బెయిల్ ఎలా వచ్చిందో అర్థం కావటం లేదన్నారు. ఖచ్చితంగా ఈ బెయిల్‌ను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామన్నారు. జెత్వానిపై పెట్టిన కేసును కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా ఈ కేసులో ఏ2గా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు ఇంకా బెయిల్ కోసం దరఖాస్తు చేయలేదని అడ్వకేట్ నర్రా శ్రీనివాస్ తెలిపారు.