కుప్పం మండలంలోని నడిమూరులో ‘పీఎం సూర్యఘర్’ పైలట్ ప్రాజెక్టును చంద్రబాబు ప్రారంభించారు. గ్రామంలో 132 ఇళ్లు ఉండగా.. 96 ఇళ్లను ఈ పథకానికి ఎంపిక చేశారు. 15 ఇళ్లకు సౌర ఫలకాలను అమర్చి సోలరైజేషన్ ప్రారంభించారు. లబ్ధిదారులు సుబ్రమణ్యం, నాగరాజు, పద్మావతి, చిన్నస్వామి ఇళ్లల్లో వాడుతున్న సౌరవిద్యుత్ పనితీరును చంద్రబాబు స్వయంగా పరిశీలించి.. వారి కుటుంబ సభ్యులతో కలిసి టీ తాగారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సోలార్ విద్యుత్ పనితీరును వివరించారు. లబ్ధిదారులు, గ్రామస్థులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ‘సూర్యఘర్ పథకంతో భవిష్యత్‌లో కరెంటు బిల్లు కట్టే భారం ఉండదు. ప్రతి ఇల్లూ నెలకు 200 యూనిట్లు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. మిగులు కరెంటుతో ఏడాదికి రూ.4 వేల ఆదాయం వస్తుంది’ అని ఆయన చెప్పారు. జూన్‌లోగా కుప్పానికి హంద్రీ-నీవా జలాలను తీసుకొస్తామన్నారు. ఆ తర్వాత.. నియోజకవర్గాన్ని కాలుష్యరహితంగా తయారుచేసే ‘నెట్ జీరో’ కాన్సె్‌ప్టపై కాన్పూర్ ఐఐటీ ప్రతినిధులతో ఎంవో యూ కుదుర్చుకున్నారు. చీగలపల్లెలో ‘ఆర్గానిక్ కుప్పం’ కార్యక్రమంలో వ్యవసాయం చేస్తున్న రైతులతో చంద్రబాబు మాట్లాడారు. రాత్రికి ద్రవిడ యూనివర్సిటీకి చేరుకుని టీడీపీ శ్రేణులతో సీఎం సమావేశమయ్యారు.ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘నా చిన్నప్పుడు ఇంట్లో కరెంటు ఉంటే గొప్పగా చెప్పుకొనేవాళ్లం. ఇప్పుడు మన ఇళ్లపై మనమే కరెంటు ఉత్పత్తి చేసుకునే స్థాయికి ఎదిగాం. కుప్పంలోని నడిమూరు.. రాష్ట్రంలోనే తొలి సోలరైజేషన్ గ్రామంగా చరిత్రలో నిలువనుంది. దీనివల్ల ఇక కరెంటు బిల్లుల భారం ఉండదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ప్రతి కుటుంబమూ మిగులు కరెంటును అమ్ముకునే స్థాయికి ఎదిగేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ దిశగానే కుప్పం నియోజకవర్గాన్ని సోలార్ పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేసి నడిమూరు నుంచి సోలరైజేషన్‌కు శ్రీకారం చుట్టానని చెప్పారు.