కరోనా వైరస్ పుట్టిన చైనా నుంచి మరో మహమ్మారి వ్యాప్తి చెందుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గడిచిన కొద్దిరోజులుగా చైనాలో హ్యూమన్ మెటా న్యూమో వైరస్ (హెచ్‌ఎంపీవీ) వ్యాప్తి చెందుతోంది. మన దేశంలో కూడా సోమవారం మూడు కేసులు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం సాయంత్రం ఆరోగ్య శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ క్రమంలో కేజీహెచ్‌లో 20 పడకలతో ఐసోలేషన్ వార్డును సిద్ధం చేసుకోవాలని అధికారులకు సమాచారం అందింది. క్యాజువాలిటీపైన మొదటి అంతస్థులో 20 పడకలతో వార్డును సిద్ధం చేస్తున్నట్టు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద తెలిపారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.