కోడిపందేలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, ఉల్లంఘించిన వారిపై ఎంతటి వారైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ హెచ్చరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో కోడిపందేలు నిర్వహించకుండా తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం కలెక్టరేట్‌లో సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కోడిపందేల నిషేధంపై రాష్ట్ర పశుసంవర్థకశాఖ రూపొందించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జంతుహింస నివారణ చట్టం ప్రకారం.. కోడిపందేలను నిషేధించడం జరిగిందన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.హైకోర్టు మార్గదర్శకాల మేరకు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో సంయుక్త తనిఖీ బృందాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. గ్రామస్థాయి బృందంలో వీఆర్వో, కానిస్టేబుల్, పశుసంవర్థకశాఖ సిబ్బంది, మండలస్థాయి బృందంలో తహసీల్ధార్, ఎస్‌హెచ్‌వో, మండల పశుసంవర్థక అధికారి, జిల్లాస్థాయి బృందంలో ఆర్డీవో/సబ్‌కలెక్టర్, డీఎస్పీ/ఏసీపీ, పశుసంవర్థకశాఖ డిప్యూటీ డైరక్టర్ సభ్యులుగా వుంటారన్నారు. ఈ బృందాలు స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, చట్టాల్లోని అంశాలను వివరించాలన్నారు. ఎవరైనా కోడిపందేలు నిర్వహించినా, పాల్గొన్నా చట్టప్రకారం నేరమేనని పేర్కొన్నారు. ఎక్కడా బరులు ఏర్పాటు కాకుండా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా వుండాలని, నిబంధనల మేరకు తహసీల్దార్లు, ఆర్డీవోలు వారి పరిధిలోని పంచాయతీలకు నోటిఫికేషన్లు జారీచేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.