జాతీయ ఉపాధి హామీ పథకం పనుల ద్వారా ఆరు నెలల్లో గ్రామాల్లో మార్పులు రావాలని, లేదంటే క్షేత్రస్థాయి సహాయకులను తొలగిస్తామని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ స్పష్టం చేశారు. ఒంగోలులో ఉన్న ఓ కన్వన్షెన్ హాలులో సోమవారం క్షేత్రస్థాయి సహాయకులు, సీనియర్ మేట్ల శిక్షణ తరగతుల్లో ఆయన ముఖ్యఅతిఽథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో కూలీలకు కనీస వేతనం రూ.220 మాత్రమే వస్తుండటంతో ముందుగా ఇక్కడ ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఉపాధి ద్వారా రైతులకు మేలు జరిగే విధంగా పనిచేయాలన్నారు. ఆ ఫలితాలు ఆరు నెలల్లో కనిపించాలన్నారు. ప్రధానంగా ప్రస్తుత సీజన్ ఉపాధి పనులకు అనుకూలమైనదన్నారు. అందువల్ల రైతుల భూముల్లో నీటి కుంటలతోపాటు పంచాయతీలో ఒక చెరువు అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ప్రయోజనం చేకూరుతున్నప్పుడు వారే ముందుకు వచ్చి నీటి కుంటల పనులు చేపడతారని ఆయన తెలిపారు. కూలీల వేతనంలో కూడా జిల్లా వెనుకబడి ఉందన్నారు. జిల్లాలో కూలీలకు రోజువారీ కేవలం రూ.220లోపు మాత్రమే లభిస్తున్నదన్నారు. తప్పనిసరిగా రోజుకు రూ.300 వేతనం ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ దిశగా ఎఫ్‌ఏలు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అదనపు కమిషనర్ శివప్రసాద్ మాట్లాడుతూ ఉపాధి ద్వారా చేపట్టాల్సిన పనులపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకొని ముందుకు వెళ్లాలని.. అప్పుడే నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తిచేసే అవకాశం ఉంటుందన్నారు. కాగా మధ్యాహ్నం జరిగిన తరగతుల్లో కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొని ఫీల్డ్ అసిస్టెంట్లకు పలు సూచనలు చేశారు. సమావేశంలో ఈజీఎస్ డైరెక్టర్ షుణ్ముగం, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ భవానీ హర్ష, వాటర్ షెడ్ జాయింట్ కమిషనర్ సునీత, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, జడ్పీ సీఈవో చిరంజీవి, డీపీవో జి.వెంకటనాయుడు, డ్వామా ఏవో ఝాన్సీ, ఏపీడీ బిజే వండర్‌మెన్ తదితరులు పాల్గొన్నారు.