నిలకడలేని కోడి గుడ్డు ధరతో రైతులు డీలా పడుతున్నారు. ముఖ్యంగా గతేడాది నవంబరు, డిసెంబరులో గుడ్డు ధర అశాజనకంగా రూ.6.30పైసలకు చేరింది. ధర పెరిగిందన్న ఆనందం రైతుల్లో ఎంతోకాలం నిలవలేదు. కారణం గుడ్డు ధర అమాంతంగా పడిపోవడమే. ప్రస్తు తం గుడ్డు ధర మార్కెట్‌లో నూతన సవంత్సరం ప్రారంభంలోనే పడిపోయింది. ఇప్పుడు హోల్ సేల్ ధర రూ.4.75కి పడిపోయింది. విడిగా గడ్డు ధర మార్కెట్‌లో రూ.6నుంచి రూ.7వరకు విక్రయిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కోళ్ల పరిశ్రమ నిర్వాహణ భారంగా మారి మూతపడే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధర 5 నెలలపాటు నిలబడితే పరిశ్రమకు ఉపశమనం కలుగు తుందని నిర్వాహకులు చెబుతున్నారు. కోళ్ల మేతకు వినియోగించే ముడి సరుకు కొరత కూడా తీవ్రంగా ఉండడం తోపాటు వాటి ధర పెరగడంతో మోయలేని భారం పడుతుందని వాపోతున్నారు. ప్రస్తుతం శీతకాలంలో 3 నెలల పాటు గుడ్డు ధర నిలకడగా ఉంటుందని అను కున్న కోళ్ల రైతులు ఆశలపై నూతన సవంత్సర ప్రారంభంలోనే నీళ్లు పడ్డాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 200వరకు కోళ్ల ఫారాలు ఉన్నాయి. వాటిలో 1.3కోట్ల మేర కోళ్లు ఉండగా వాటి నుంచి 1.10 కోట్లమేర గుడ్లు ఉత్పత్తవుతున్నాయి. 60శాతం గుడ్లు మేర పొరుగు రాష్ట్రాలకు ఎగుమతులు అవుతుండగా ఇక్కడ ప్రజలకు 40 శాతం మేర సరఫరా చేస్తున్నారు. నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు గుడ్డు ధర నిలకడగా ఉంటే కోళ్ల రైతులు నష్టాల బారి నుంచి కొంతమేర గట్టెక్కేవారు. కానీ ఇప్పుడు గుడ్డు ధర నిలకడగా లేకపోవటం వల్ల నష్టాలు తప్పవని కోళ్ల పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుత కోళ్లపరిశ్రమ పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈశాన్యరాష్ట్రాల్లో కోళ్ల పరిశ్రమలు పెరగడం కూడా ఇక్కడ రైతులపై ప్రభావం చూపిస్తుందని వారు చెబుతున్నారు.