విజయవాడ సమీపంలో జరిగిన హైందవ శంఖారావం సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరీ రాజకీయ విమర్శలు చేయడం దారుణమని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు, మాజీ దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఖండించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఈ సభలో మిగిలిన వారికి విరుద్దంగా పురంధేశ్వరీ గత వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంపై రాజకీయపరమైన ఆరోపణలు చేయడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. తన మరిది చంద్రబాబు ప్రయోజనాల కోసమే పురంధేశ్వరి ఇటువంటి వ్యాఖ్యలు చేసిందని మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..... హైందవ శంఖారావం సభలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరీ మాట్లాడుతూ గత అయిదేళ్ళ వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో హైందవ ధర్మంపై విపరీతమైన దాడి జరిగిందని, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నట్లుగా ఆరోపణలు చేశారు. ఆమె ఏ పార్టీలో ఉంటే, ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడటం అలవాటు. పదేళ్ళు కాంగ్రెస్ లో సెక్యులరిస్ట్ గా, తరువాత బీజేపీలో చేరి హిందూవాదిగా చెప్పుకుంటూ, తన మరిది చంద్రబాబు ప్రయోజనాలను కాపాడటం కోసం ప్రతిక్షణం ప్రయత్నిస్తోంది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాజమండ్రి పుష్కరాల్లో ఆయన ప్రచార ఆర్భాటం వల్ల దాదాపు 29 మంది హిందువులు దుర్మరణం పాలైనప్పుడు పురంధేశ్వరీ మాట్లాడలేదు. చంద్రబాబు సీఎంగా, బీజేపీకి చెందిన ఎమ్మెల్యే దేవాదాయ శాఖా మంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో దాదాపు 40 కిపైగా ఆలయాలను కూల్చేశారు. దేవతల విగ్రహాలను చెత్త ట్రాక్టర్ లలో తలించారు. అప్పుడు హిందుత్వవాది పురంధరేశ్వరికి అవేవీ కనిపించలేదు. ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా నిర్వహించిన హైందవ సభలో చంద్రబాబుకు మేలు చేయాలని, గత వైయస్ఆర్సీపీ పాలనపై బుదరచల్లాలనే ఉద్దేశంతోనే ఆమె మాట్లాడారు అని మండిపడ్డారు.