బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానికి హైకోర్టులో కాస్త ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి పేర్నినాని వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను ఈనెల (జనవరి) 20కి ధర్మాసనం వాయిదా వేసింది. అప్పటి వరకు తొందరపాటు చర్యలు వద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం ఘటనలో ఏ6గా పేర్నినాని ఉండగా, ఏ1గా పేర్నినాని సతీమణి జయసుధ ఉన్నారు. గోడౌన్ మొత్తం కూడా జయసుధ పేరుమీద ఉండటంతో మొదటి నుంచి ఈ కేసులో జయసుధ ఉన్నారు. అయితే ఏ6గా పేర్నినాని చేర్చారు పోలీసులు. ఈ విషయం తెలిసిన వెంటనే పేర్నినాని హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. నిన్న ఈ కేసుపై విచారణ జరుగగా.. నేటికి వాయిదా వేసింది హైకోర్టు. ఈరోజు మరోసారి పేర్నినాని పిటిషన్‌పై హైకోర్టులో విచారణకు వచ్చింది. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం.. జనవరి 20 (సోమవారం) వరకు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.