పేదల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజని విమర్శించారు. ఆరోగ్యశ్రీ పథకం పేదలకు సంజీవనిలాంటిదని చెప్పారు. ఆరోగ్యశ్రీని రాజశేఖరరెడ్డి తీసుకొచ్చారని... ఆ పథకాన్ని జగన్ మరింత బలోపేతం చేశారని తెలిపారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ను ప్రస్తుత ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ. 3 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని... బకాయిలను ప్రభుత్వం చెల్లించపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలను ఆసుపత్రులు ఆపేశాయని విడదల రజని అన్నారు. ఓటు వేసి గెలిపించినందుకు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని చెప్పారు. ప్రజల ఆరోగ్య బాధ్యత ప్రభుత్వానిది కాదనే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.637 కోట్ల పాత ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలను వెంటనే చెల్లించాలని రజని డిమాండ్ చేశారు.