చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, అనితలపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల వ్యవహారంలో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని అరెస్ట్ చేసే అవకాశాలుండడంతో వైసీపీ కార్యకర్తలు భారీగా పులివెందుల పోలీస్ స్టేషన్ వద్దకు తరలివచ్చారు. వైసీసీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డితో అసభ్య పోస్టులు పెట్టించాడని రాఘవరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. అటు... ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులోనూ రాఘవరెడ్డి ఏ20 నిందితుడిగా ఉన్నాడు. ఇవాళ పులివెందులలోని రాఘవరెడ్డి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఏపీ హైకోర్టు రాఘవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే, ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని పులివెందుల పీఎస్ కు తరలించారు.