క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడి పలు మోసాలు చేస్తున్న ఇరువురిని పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద రూ.8లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు ఒంగోలు రూరల్ పోలీసు స్టేషన్ ఆవరణంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. బల్లికురవ మండలం కొప్పెరపాడుకు చెందిన కోట విజయకృష్ణ, పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం సాలింనగర్‌కు చెందిన చిక్కాల దొమ్నిక్ చక్రవర్తిలను నాగులుప్పలపాడు పోలీసులు గురువారం ఉదయం అరెస్టు చేసినట్లు తెలిపారు.వివరాల్లోకి వెళ్ళితే.... నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరుకు చెందిన శనగల వ్యాపారి కొణిజేటి సురే్‌షబాబుకు విజయకృష్ణ, దొమ్నిక్ చక్రవర్తిలు కలిసి ఒక రోజు ఫోన్ చేశారు. నేను మీ మేనల్లుడిని అని పరిచయం చేసుకున్నారు. ఇలా ఫోన్‌లో మాటలు పెంచుకుని ఆప్యాయత చూపారు. మేనల్లుడు అని నమ్మకం కలిగిన తరువాత తాము ప్రైవేటు కంపేనీ పెడుతున్నామని, అందుకు డబ్బులు అవసరమయ్యాయని, ఇస్తే తిరిగి ఇస్తామని చెబుతారు. అందుకు సురే్‌షబాబు పలుమార్లు తన ఫోన్ ద్వారా రూ.8,34,000 నగదు బదిలీ చేశారు. ఆ నగదును నిందితులు బ్యాంక్ నుంచి డ్రా చేసుకున్న తరువాత ఫోన్‌కు స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన సురేష్‌బాబు నాగులుప్పలపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. విజయకృష్ణ అనే నిందితుడుపై 2017 నుంచి ఇప్పటి వరకు విజయనగరం, కృష్ణా జిల్లాలో ఆరు కేసులు నమోదయ్యాయని డీఎస్పీ చెప్పారు.