అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరాన్ని కార్చిచ్చు బుగ్గి చేస్తోంది. ఎక్కడ చూసినా కాలిపోయి బూడిదగా మారిన ఇళ్లు కనిపిస్తున్నాయి. ఎగసి పడుతున్న మంటలు, పొగ అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాలకు కూడా కనిపిస్తున్నాయి. అత్యంత సంపన్నమైన నగరంగా పేరుగాంచిన లాస్ ఏంజెలెస్ ఇప్పుడు మరుభూమిని తలపిస్తోంది. పసిఫిక్ పాలిసేడ్స్ ప్రాంతంలో అత్యంత ఖరీదైన విలాసవంతమైన భవనాన్ని కార్చిచ్చు బుగ్గి చేసింది. ఆ భవనం విలువ దాదాపు 125 మిలియన్ డాలర్లు ఉంటుందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అంటే మన కరెన్సీ ప్రకారం ఆ భవనం విలువ రూ. 10,375 కోట్లు. ఆ భవనంలో 18 పడక గదులు ఉన్నాయి. ఈ భవంతి లుమినార్ టెక్నాలజీస్ సీఈఓ ఆస్టిన్ రస్సెల్ ది. మరోవైపు, మొత్తం ఆస్తి నష్టం 150 బిలియన్ డాలర్లకు (రూ. 12.9 లక్షల కోట్లు) పెరగొచ్చని అక్యూవెదర్ సంస్థ అంచనా వేసింది. ఈ కార్చిచ్చు అమెరికా బీమా రంగంపై తీవ్ర ప్రభావం చూపించబోతోంది. బీమా రంగం కుదేలయ్యే పరిస్థితి నెలకొంది. జేపీ మోర్గాన్, మార్నింగ్ స్టార్ అంచనాల ప్రకారం బీమా సంస్థలకు 20 బిలియన్ డాలర్ల వరకు నష్టం రావచ్చని అంతర్జాతీయ మీడియా తెలిపింది.