బీబీనగర్ – నడికుడి రైల్వే మార్గాన్ని డబ్లింగ్ చేయాలంటూ ఎన్నో ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గతేడాది ఎట్టకేలకు ఈ మార్గంలో బీబీనగర్ – గుంటూరు మధ్య 239 కి.మీ.రెండో లైను నిర్మాణ పనులకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు ఇటీవల విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ డబ్లింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత కీలకమైన సికింద్రాబాద్- నడికుడి- గుంటూరు రైలు మార్గానికి మొత్తం నిర్మాణ వ్యయం రూ.2853.23 కోట్లు కాగా.. సిగ్నలింగ్ టెలికాం పనులకు రూ.319.62 కోట్లు.. సివిల్ పనులకు రూ.1947.44 కోట్లు, ఎలక్ర్టికల్ ఇంజనీరింగ్ నిర్మాణ పనులకు రూ.586.17 కోట్ల అంచనా వ్యయంగా నిర్ణయించారు. సికింద్రాబాద్ – విజయవాడకు మధ్య ప్రస్తుతం రెండు రైలు మార్గాలుండగా, అందులో ఒకటి ఖాజీపేట, ఖమ్మం.. మరో మార్గం బీబీనగర్ -నడికుడి, గుంటూరు మార్గం. ఇది సింగిల్ లైన్ కావడంతో ఒక రైలు ప్రయాణిస్తుంటే ఎదురుగా వచ్చే రైలును ముందు రైల్వేస్టేషన్‌లో పక్కకు ఆపాల్సి వస్తుంది. అదే రెండో లైను నిర్మాణం పూర్తయితే అంతరాయం తప్పడంతో రైళ్ల వేగం పెరుగుతుంది. అదనపు రైలు నడపడానికి అవకాశం ఉంటుంది. బీబీనగర్-గుంటూరు మార్గంలో 139కిలో మీటర్ల పరిధి తెలంగాణలోకి వస్తుండగా, వంద కిలోమీటర్ల పరిధి రైల్వే ట్రాక్ ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు సింగిల్ లైను గరిష్ట వేగం సామర్థ్యం 130కిలో మీటర్లు కాగా, అదే వందేభారత్ రైలు వేగం సామర్థ్యం 160కిలో మీటర్లుగా ఉంది. ఇప్పుడు చేపట్టనున్న రెండో లైను వేగం సామర్థ్యం 150 నుంచి 160కిలో మీటర్ల వేగాన్ని తట్టుకునే విధంగా నిర్మించనున్నారు.
బీబీనగర్- నడికుడి- గుంటూరు రైల్వే మార్గాన్ని డబ్లింగ్ చేస్తే.. సికింద్రాబాద్ నుంచి తిరుపతి, చెన్నైలకు దూరభారం తగ్గనుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి, నెల్లూరు, చెన్నైలకు వయా విజయవాడతో పోలిస్తే.. నడికుడి, గుంటూరు మార్గంలో దాదాపు 46 కి.మీ. దూరం తక్కువ ఉంది. ముఖ్యంగా సికింద్రాబాద్ – విజయవాడ మధ్య ప్రస్తుతం రెండు రైల్వే రూట్లు ఉన్నాయి. ఇందులో కాజీపేట – ఖమ్మం మార్గంలో ప్రయాణిస్తే సికింద్రాబాద్ – విజయవాడ మధ్య 350 కి.మీ దూరం ఉంది. మరో మార్గమైన బీబీనగర్- నడికుడి- గుంటూరు మార్గంలో విజయవాడకు దూరం 336 కి.మీ మాత్రమే ఉంది. దీంతో బీబీనగర్ నడికుడి రైల్వే మార్గం అత్యంత రద్దీ మార్గంగా మారింది. దక్షిణ మధ్య రైల్వేలో ఈ ట్రాక్ సామర్థ్య వినియోగం ఏకంగా 148.25 శాతం ఉంది. ఈ మార్గాన్ని డబ్లింగ్ చేస్తే రైళ్ల వేగం పెరగడంతో పాటు అదనపు రైళ్లు నడపడానికి అవకాశం ఉంటుంది.