అయ్యప్ప స్వామి వార్షిక ఉత్సవాల్లో కీలక ఘట్టం నేడు ఆవిష్కృతం కానుంది. శబరిమలలోని కందమల శిఖరంపై అయ్యప్ప మకరజ్యోతి దర్శనం ఇచ్చేందుకు సమయం ఆసన్నం అయింది. ఏటా మకర సంక్రాంతి రోజున శబరిమలలో కనిపించే ఈ మకరజ్యోతిని కళ్లారా చూసేందుకు వేలాది మంది అయ్యప్ప భక్తులు.. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి.. శబరి కొండకు చేరుకుంటారు. ఈ క్రమంలోనే ఇవాళ శబరిమలలో కనిపించే మకరజ్యోతిని చూసేందుకు అక్కడ ఉన్నవారే కాకుండా యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. టీవీలు, సోషల్ మీడియాల్లో ఈ మకరజ్యోతికి సంబంధించిన దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.మకర సంక్రమణ సమయంలో.. కాంతమలైగా పిలిచే పొన్నంబలమేడుపై జ్యోతి రూపంలో దర్శనమిచ్చే అయ్యప్పస్వామి దర్శనానికి భక్తులు శబరికొండకు తరలివస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న భద్రతకు తోడు అదనంగా 5 వేల మందిని మోహరించింది. జ్యోతి దర్శనం సాయంత్రం 6-7 గంటల మధ్య జరగనుంది. దీని కోసం లక్ష మందికిపైగా అయ్యప్ప భక్తులు వస్తారని అంచనా.