ఏపీ డిప్యూటీ సీఎం పదవిని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్‌కు ఇవ్వాలనే డిమాండ్ టీడీపీలో బలంగా వినిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు కూడా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని తన మనసులోని మాటను బయటపెట్టారు. తాజాగా మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ డిమాండ్‌ను వినిపించారు.ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సోమిరెడ్డి ట్వీట్ చేశారు. ‘‘డిప్యూటీ సీఎం పదవికి లోకేష్ బాబు అన్ని విధాలా అర్హులే. నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసులు రెడ్డి ప్రతిపాదనను నేను సమర్థిస్తున్నాను. ఆ పదవికి లోకేష్ వందశాతం అర్హులే. రాజకీయంగా అనేక సవాళ్లు ఎదుర్కొని, అవమానాలు పడిన తర్వాత యువగళం పాదయాత్రతో తనలోని నాయకత్వ లక్షణాలను లోకేష్ నిరూపించుకున్నారు. లోకేష్ పోరాటపటిమను చూసి టీడీపీ కేడర్‌తో పాటు రాష్ట్ర ప్రజానీకం కూడా అండగా నిలిచి ఆయన నాయకత్వాన్ని జైకొట్టింది. డిప్యూటీ సీఎం పదవికి అన్ని విధాలా అర్హుడైన లోకేష్ పేరును ఈ పదవికి పరిశీలించాలని టీడీపీ హై కమాండ్‌ను కోరుతున్నాను’’ అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.