తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌పై చర్యలు తీసుకునేందుకు టీడీపీ రంగం సిద్ధం చేస్తోంది. మహిళపై దాడి ఘటన నేపథ్యంలో టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుట కొలికపూడి సోమవారం హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. జనవరి 11న ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఎస్టీ మహిళపై కొలికిపూడి దాడి చేశాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఘటనపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. దాడికి సంబంధించిన కారణాలను క్రమశిక్షణ కమిటీ ముందు తెలపాలంటూ ఆయనకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కొలికపూడి వ్యవహారంలో తిరువూరు ఘటనపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఓ మహిళపై కొలికపూడి దాడి చేశారంటూ మళ్లీ పెద్దఎత్తున విమర్శలు రావడంపై టీడీపీ అధిష్ఠానం విచారణకు ఆదేశించింది. ఆయన ఇచ్చే వివరణను క్రమశిక్షణ కమిటీ బృందం హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనుంది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పార్టీ అధిష్ఠానం ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోనుంది.