రోజురోజుకు మనుషులు విచక్షణ లేకుండా, స్వార్థపూరితంగా ప్రవర్తిస్తున్నారు. పక్కింట్లో మ్యూజిక్ ఎక్కువగా పెట్టారని ఓ 12వ తరగతి విద్యార్థిని తగ్గించమని చెబితే వారు తగ్గించలేదు. దీనికి తోడు ఆ యువకులు ఇంకా హాంగామా సృష్టించడంతో ఆ యువతి పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారి మ్యూజిక్ సిస్టమ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ క్రమంలో ఆగ్రహం చెందిన ఆ యువకులు ఆ యువతి ఇంటికి వచ్చి దాడి చేశారు.ఆ క్రమంలో యువతి కుటుంబంలోని 65 ఏళ్ల వ్యక్తిని కర్ర, పారతో దాడి చేసి హత్య చేశారు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని చందేరి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోరకల గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. దీనిపై స్పందించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రతిరామ్ అహిర్వార్, ముఖేష్ అహిర్వార్ ని అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు ఆధారంగా ఈ ఘటన మ్యూజిక్ పై వచ్చిన వివాదం వల్ల జరిగిన హత్యగా నిర్ధారించబడింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించారు.