హమాస్, ఇజ్రాయేల్ మధ్య జనవరి 19 నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీంతో ఒప్పందాన్ని పకడ్బంధీగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఒప్పందంలో భాగంగా ఇజ్రాయేల్ సోమవారం 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. ఇప్పటికే తమ వద్ద బందీలుగా ఉన్నవారిలో ముగ్గురు ఇజ్రాయేల్ పౌరులను హమాస్ విడుదల చేయడంతో.. పాలస్తీనియన్లకు విముక్తి కల్పించారు. ఇజ్రాయేల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో దాదాపు 16 నెలలుగా కొనసాగుతోన్న యుద్ధానికి తాత్కాలికంగా తెరపడింది.
కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఆరు వారాల్లో హమాస్ 33 మంది బందీలను, ఇజ్రాయేల్ దాదాపు 2 వేల మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాల్సి ఉంది. హమాస్ ముగ్గుర్ని, ఇజ్రాయేల్ 90 మందిని తొలి దశలో విడుదల చేశాయి. ఇజ్రాయేల్ విడుదల చేసినవారిలో పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా నాయకురాలు ఖలీదా జర్రర్ (62) సహా 69 మంది మహిళలు, 21 మంది టీనేజ్ బాలురు ఉన్నారు. 1970 దశకం నుంచి ఇజ్రాయేల్‌కు వ్యతిరేకంగా దాడులు, విమానాల హైజాక్స్‌లో పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా కీలకంగా వ్యవహరిస్తోంది. అక్టోబరు 7 నాటి హమాస్ మారణహోమంలోనూ ఈ గ్రూప్ పాల్గొన్నట్టు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, కాల్పుల విరమణ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నెతన్యాహూ ప్రభుత్వం నుంచి ఓజ్మా యేహూదిత్ పార్టీ వైదొలగింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఇప్పటికే తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. అక్టోబరు 7, 2023లో హమాస్ సాయుధులు ఇజ్రాయెల్‌లోకి చొరబడి నరమేధానికి తెగబడి.. 1200 మందిని ఊచకోత కోశారు. అలాగే, 250 మందిని తమ వెంట బందీలుగా తీసుకెళ్లారు. ఈ మారణహోమంతో రగలిపోయిన ఇజ్రాయేల్.. హమాస్‌పై ప్రతీకారం తీర్చుకోడానికి గాజాపై యుద్ధం ప్రకటించింది. అప్పటి నుంచి భీకర దాడులతో హమాస్ స్థావరాలపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 47 వేల మందికిపైగా చనిపోయినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.. తాజా ఒప్పందంతో గాజాలో శాంతి నెలకొనే అవకాశాలు ఉన్నాయి.