వరుసకు సోదరులైన ఇద్దరు యువకులు పొట్టకూటి కోసం మలేసియా వెళ్లి చిక్కుల్లో పడ్డారు. వారిని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ రక్షించి స్వదేశానికి తీసుకురావాలని వారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెగచర్ల గ్రామానికి చెందిన కరిపం పెంచలయ్య, కరిపం పెద్దయ్య అన్నదమ్ములు. వీరి పిల్లలు కరిపం పవన్‌కుమార్ (23), కరిపం సింహాద్రి(22) జీవనోపాధి కోసం ఏడు నెలల క్రితం మలేసియా వెళ్లారు. తిరుపతికి చెందిన ఏజెంట్ వెంకటేశ్వర్లు వీరిని పర్యాటక వీసాపై మలేసియాకు తీసుకెళ్లి మోసం చేశాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పర్యాటక వీసా గడువు ముగియడంతో వారిని ఏజెంట్ మలేసియాలో వదిలేసి వెళ్లిపోయాడని, దిక్కుతోచని తమ బిడ్డలు అక్కడే ఉండిపోయారని తెలిపారు. 20 రోజుల క్రితం తమను పోలీసులు పట్టుకున్నారంటూ పవన్‌కుమార్ , సింహాద్రి ఫోన్ చేసి చెప్పారన్నారు. బుధవారం వెంకటగిరిలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణను కలిసి విషయం తెలియజేశామని పెంచలయ్య, పెద్దయ్య తెలిపారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ స్పందించి తమ బిడ్డలను కాపాడాలని వారు వేడుకుంటున్నారు.