ఎన్నికలకు ముందే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొందరు నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రి.. పార్టీకి గుడ్‌బై చెప్పగా.. తాజాగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సరిగ్గా ఓటింగ్‌కు 5 రోజులు ఉండగా.. ఇలాంటి సమయంలో ఆ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలు బిగ్ షాకిచ్చారు. ఎమ్మెల్యే పదవితోపాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ పంపించారు. ఈ ఎన్నికల్లో తమకు టికెట్ కేటాయించకపోవడంతోనే.. పార్టీకి రాజీనామా చేయాల్సి వస్తోందని.. ఆ లేఖలో ఎమ్మెల్యేలు వెల్లడించారు. గతంలో ఆప్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన ఈ ఏడుగురికి ఈసారి పార్టీ టికెట్లు ఇవ్వకపోవడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.
మెహ్రౌలీ ఎమ్మెల్యే నరేష్ యాదవ్.. త్రిలోక్‌పురి ఎమ్మెల్యే రోహిత్ కుమార్.. జనక్‌పురి ఎమ్మెల్యే రాజేష్ రిషి.. కస్తుర్బానగర్ ఎమ్మెల్యే మదన్‌లాల్.. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే పవన్ శర్మ.. పాలం ఎమ్మెల్యే భావన గౌడ్.. బిజ్వాసన్ ఎమ్మెల్యే బీఎస్ జూన్.. శుక్రవారం ఆప్‌కు రాజీనామా చేశారు. ఇక తన రాజీనామా లేఖలో పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై పాలెం ఎమ్మెల్యే భావ గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కేజ్రీవాల్‌పై నమ్మకం పోయిందని పేర్కొన్నారు.
ఇక మెహ్రౌలీ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఖురాన్ అపవిత్రం కేసులో నరేష్ యాదవ్‌ను గతేడాది డిసెంబరులో పంజాబ్ కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో అతడికి రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. కానీ ఈ తీర్పుపై నరేష్ యాదవ్ స్టే తెచ్చుకున్నారు. అయితే ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ విడుదల చేసిన ఐదో జాబితాలో మెహ్రౌలీ నియోజకవర్గం నుంచి నరేష్ యాదవ్ స్థానంలో మహేందర్ చౌదరిని అభ్యర్థిగా ఆప్ ప్రకటించడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు.
నిజాయితీ రాజకీయాలు చేయాలని ఏర్పాటైన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇప్పుడు వాటిని వదిలేసిందని నరేష్ యాదవ్ తన రాజీనామా లేఖలో ఆరోపించారు. అవినీతిని అరికడతామని ఇచ్చిన హామీని నెరవేర్చే బదులు.. ఆ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలు జైలుకు వెళ్లివచ్చారని పేర్కొన్నారు.
దళిత, వాల్మీకి వర్గాలకు సామాజిక న్యాయం చేయాలనే ఆశతో అన్నా హజారే నేతృత్వంలోని అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో తాను ఆమ్ ఆద్మీ పార్టీలో చేరినట్లు త్రిలోక్‌పురి ఎమ్మెల్యే రోహిత్ కుమార్ ట్వీట్ చేశారు. తమ వర్గాలకు ఇచ్చిన హామీలను ఆప్ వదిలేసిందని.. కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో కీలకమైన సమస్యలను పరిష్కరించడంలో ఆప్ విఫలం అయిందని రోహిత్ కుమార్ వెల్లడించారు.
జనక్‌పురి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజేష్ రిషి.. సంతోష్ కోలీ త్యాగానికి అవమానం జరిగిందని పేర్కొన్నారు. సంతోష్ కోలీని చంపిన హంతకుడికి టికెట్ ఇవ్వడం.. ఆప్ కార్యకర్తలకు ద్రోహం చేయడమేనని పేర్కొన్నారు. పార్టీలో ఆశ్రిత పక్షపాతం ఉందని.. అది ఒక నియంత్రణ లేని ముఠాగా మారిపోయిందని అభివర్ణించారు. పార్టీ నాయకత్వం అవినీతి, బంధుప్రీతి, నియంతృత్వానికి మారుపేరుగా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.