మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ అమ్మాయి.. దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో వివాహం చేసుకోవడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతి ఇచ్చారు. మరికొద్ది రోజుల్లోనే వీరి వివాహం జరగబోతుండగా.. బంధువులు అంతా ఢిల్లీకి రాబోతున్నారు. అసలు మధ్య ప్రదేశ్ అమ్మాయికి, అది కూడా ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి రాష్ట్రపతి ఎందుకు అనుమతిచ్చారు, అసలా అమ్మాయి ఎవరు, నేపథ్యం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మధ్య ప్రదేశ్‌లోని శివపురికి చెందిన పూనమ్ గుప్తా నవోదయ విద్యాలయంలో చదువుకున్నారు. ఆమె తండ్రి అక్కడే నవోదయ విద్యాలయంలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా సేవలు అందిస్తుండగా.. పూనమ్ గుప్తా గణితంలో గ్రాడ్యుయేషన్, ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అంతేకాకుండా గ్వాలియర్‌లోని శివాజీ విశ్వ విద్యాలయంలో బీఈడీ చేశారు. 2018లో జరిగిన యూపీఎస్సీ సీఏపీఎఫ్ పరీక్షల్లో పూనమ్ గుప్తాకు 81వ ర్యాంకు వచ్చింది. ఇలా ఆమె సీఆర్పీఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు.
ప్రస్తుతం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పీఎస్ఓ హోదాలో అంకిత భావంతో సేవలు అందిస్తున్నారు. ఈక్రమంలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. పూనమ్ గుప్తాను చూడడం, ఆమెను సేవలు నచ్చడంతో పలుమార్లు ప్రశంసించడం జరిగింది. అయితే ఇటీవలే జరిగిన గణతంత్ర దినోత్స వేడుకల్లో జరిగిన పరేడ్‌లో సీఆర్పీఎఫ్ మహిళా దళానికి పూనమ్ గుప్తానే సారథ్యం వహించారు. ఇది చూసిన ద్రౌపది ముర్ము పూనమ్ గుప్తా పట్ల మరింత ఆకర్షితులయ్యారు.
అయితే ఇటీవలే పూనమ్ గుప్తాకు.. జమ్ము కశ్మీర్‌లోని సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్‌గా సేవలు అందిస్తున్న అవ్నీష్ కుమార్‌తో పెళ్లి ఖరారు అయింది. ఫిబ్రవరి 12వ తేదీనే వీరి వివాహం జరగబోతుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. వీరి వివాహం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. ముఖ్యంగా రాష్ట్రపతి భవన్‌లోని మదర్ థెరిస్సా క్రౌన్ కాంప్లెక్స్‌లో వివాహ వేడుకను నిర్వహించుకోమని చెప్పగా.. పూనమ్ గుప్తా, అవ్నీష్ కుమార్ సహా వారి కుటుంబ సభ్యులు అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మధ్య ప్రదేశ్ నుంచి తమ బంధువులు, స్నేహితులు అందరినీ తీసుకుని వచ్చి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోనే పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయ్యారు. అయితే రాష్ట్రపతి భవన్లో పెళ్లి అవుతుండడంతో అందరినీ పిలవకుండా ముఖ్యమైన కొంత మంది అతిథులను మాత్రమే ఆహ్వానించాలని కూడా ఇరుకుటుంబాలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఓ జాబితా తయారు చేసి వారిని మాత్రమే లోపలికి అనుమతించబోతున్నారట.