ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుంభమేళాలో బాలీవుడ్ నటి మమతా కులకర్ణికి బిగ్ షాక్.. దీక్ష రద్దు చేసి అఖాడా నుంచి తొలగింపు

national |  Suryaa Desk  | Published : Fri, Jan 31, 2025, 08:27 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఎంతో మంది సాధువులు, అఖాడాలకు చెందినవారు హాజరవుతున్నారు. అయితే చాలా మంది సామాన్య జీవితాన్ని వదిలేసి సన్యాసులుగా మారుతున్నారు. సన్యాసం తీసుకునేందుకు మహా కుంభమేళా సరైన వేదిక అని భావించి.. అక్కడికి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరోయిన్ 52 ఏళ్ల మమతా కులకర్ణి ఇటీవలె.. తాను సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఆమె సన్యాసం స్వీకరించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. కిన్నెర అఖాడాలో మమతా కులకర్ణి.. మహామండలేశ్వర్‌గా దీక్షను స్వీకరించారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడే అసలు సమస్య మొదలైంది. ఆమెకు కిన్నెర అఖాడా షాకిచ్చింది. ఆమె మహామండలేశ్వర్‌ దీక్షను రద్దు చేసి.. కిన్నెర అఖాడా నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


వివిధ రకాల మతపెద్దలు, అఖాడాల నుంచి వస్తున్న తీవ్ర అభ్యంతరాల నేపథ్యంలో మమతా కులకర్ణి మహామండలేశ్వర్‌ దీక్షను రద్దు చేస్తున్నట్లు కిన్నెర అఖాడా వెల్లడించింది. అయితే కేవలం మమతా కులకర్ణిని మాత్రమే కాకుండా ఆమెను అఖాడాలో చేర్పించిన కిన్నెర అఖాడా ఆచార్య మహామండలేశ్వర్‌ డాక్టర్‌ లక్ష్మీనారాయణ్‌ త్రిపాఠిని కూడా అఖాడా నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొనడం సంచలనంగా మారింది. అయితే మమతా కులకర్ణి చేరిన తర్వాత కిన్నెర అఖాడాలో సభ్యుల మధ్య తీవ్ర వివాదాలు చెలరేగాయి. ఆమె అఖాడాలో చేరగానే అందులో అత్యున్నత స్థానమైన మహామండలేశ్వర్‌ హోదాను కల్పించడాన్ని అఖాడాలోని కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు.


ఇక మమతా కులకర్ణి సన్యాసం స్వీకరించిన వేళ.. మహా కుంభమేళా అనేది ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమం అని.. కానీ కొందరు వ్యక్తులు అసభ్యతను ప్రోత్సహిస్తున్నారంటూ ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇప్పటివరకు సుఖాలు అనుభవించినవారు.. ఒకేసారి సన్యాసులుగా మారిపోయి.. మహామండలేశ్వర్ వంటి బిరుదులను పొందుతున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కిన్నెర అఖాడా ఫౌండర్ అజయ్ దాస్.. మమతా కులకర్ణి గురువు లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి మధ్య తీవ్ర విభేదాలు ఎక్కువయ్యాయి.


అయితే కిన్నెర అఖాడా నుంచి అజయ్‌ దాస్‌ బయటకు వెళ్లి.. తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారని లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి ఆరోపించారు. కిన్నెర అఖాడా రూల్స్ ప్రకారం కుటుంబంతో కలిసి ఉన్నవారికి ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం లేదని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మమతా కులకర్ణిపై బహిష్కరణ వేటు వేస్తున్నట్లు కిన్నెర అఖాడా వెల్లడించడం గమనార్హం.


1990ల్లో బాలీవుడ్‌లో మమతా కులకర్ణి.. మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. అయితే 2003 తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి విదేశాలకు వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే డ్రగ్స్‌ రాకెట్‌లో మమతా కులకర్ణి పేరు వినిపించగా.. ఆమెకు పోలీసులు నోటీసులు కూడా పంపించారు. అయితే 20 ఏళ్లు దాటిపోయిన తర్వాత ఇటీవల ఉన్నఫళంగా భారత్‌కు వచ్చిన మమతా కులకర్ణి.. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ మహా కుంభమేళ సందర్భంగా కిన్నెర అఖాడాలో చేరింది. ఈ క్రమంలోనే తన పేరును కూడా మాయీ మమతానంద్‌ గిరిగా మార్చుకుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com