మున్సిపల్ ఉప ఎన్నికలను తక్షణం వాయిదా వేయాలని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పోరేషన్ డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్, వైయస్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్ తక్షణం స్పందించాలని కోరారు. దాడులు, కిడ్నాప్ లు, అరాచకాలకు తెలుగుదేశం పార్టీ తెగబడుతున్న నేపథ్యంలో ప్రజాస్వామికంగా ఎన్నికలు సాధ్యమని ప్రశ్నించారు. అయన మాట్లాడుతూ.... నిన్న సాయంత్రం హిందూపూర్ లో వైయస్ఆర్ సీపీ కార్పోరేటర్లను ఎత్తుకుపోయారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి.
ఈ రాష్ట్రంలోని వ్యవస్థలపై నమ్మకం లేక నిన్న ఎన్నికల కమిషన్ ను కలిసి వినతిపత్రం సమర్పించాం. రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోంది, వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి, వైయస్ఆర్ సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు రక్షణ లేకుండా పోయింది, పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు అని వివరించాం. ఈ పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగేలా చూడాలని పార్టీ పరంగా విజ్ఞప్తి చేశాం. అయినా కూడా రాష్ట్రంలో ఎక్కడా వైయస్ఆర్ సీపీ కార్పోరేటర్లు, కౌన్సిలర్లకు రక్షణ లేకుండా పోయింది. వందలాది మంది తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కర్రలు, కత్తులు, రాళ్ళతో ఎన్నికల కోసం వెడుతున్న వైయస్ఆర్ సీపీ కార్పోరేటర్లు, కౌన్సిలర్ల వాహనాలపై పట్టపగలే దాడులకు తెగబడుతుంటే ఈ రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థ ఎందుకు చేతులు కట్టుకుని చూస్తుండి పోతోంది? 144, సెక్షన్ 30 అమలులో ఉన్నప్పటికీ కూడా ఎందుకు అంతమంది రోడ్డు మీదికి వస్తుంటే చట్టపరంగా అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు? దీనిపై వైయస్ఆర్ సీపీ వెంటనే ఎన్నికల కమిషన్ కు కలిసి వివరాలు అందించడంతో పాటు మరోసారి ఫిర్యాదు చేయబోతున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించేందుకు ఎన్నికల కమిషన్ తక్షణం స్పందించాలని కోరుతున్నామని అన్నారు.