విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో ఉత్పత్తి వ్యయాల తగ్గింపు పేరుతో సిబ్బందిని కుదిస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకానికి 1,594 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ఇప్పుడు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) నుంచి 438 మందిని హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాలకు బదిలీ చేసేశారు. వారి స్థానంలో ఎవరినీ నియమించరు. అయితే వారి స్థానంలో హోం గార్డులను పెడతామని చెప్పడం ఖర్చు తగ్గింపులా లేదని, ఇందులో ఏదో మతలబు ఉందని ఉద్యోగ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు అత్యాధునిక అగ్ని మాపక శకటాలు, పరికరాలు కలిగిన ఉక్కు అగ్నిమాపక విభాగాన్ని ప్రైవేటుకు అప్పగించాలని స్టీల్ ప్లాంటు యాజమాన్యం నిర్ణయించింది. ఆమేరకు డిసెంబరు నెలాఖరులో ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన జారీ చేసింది. దీనిపై అప్పుడే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.