ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, శంబర పోలమాంబ మారువారం జాతర మంగళవారం ఘనంగా జరిగింది. తొలి వారంలానే సుమారు లక్ష మందికి పైగా భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణంలో క్యూలైన్లన్నీ కిటకిటలాడాయి. చదురుగుడి వద్ద క్యూలైన్లు నిండిపోవడంతో భక్తజనం కొంత సమయం ఎండలోనే నిరీక్షించారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ర్టాల నుంచి వచ్చిన వారు ఉదయం ఐదు గంటల నుంచే అమ్మవారి దర్శనానికి బారులుదీరారు.
క్యూలైన్లలో వేచి ఉన్న వారికి తాగునీరు, చిన్నారులకు పాలు పంపిణీ చేశారు. మరోవైపు గోముఖి నది తీరాన ప్రజలు కోళ్లు, చీరలతో మొక్కులు చెల్లించుకున్నారు. వనంగుడి వద్ద వేపచెట్టుకు మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. కొందరు అక్కడే వంటలు చేసుకుని సామూహిక భోజనాలు చేశారు. ఈవో వీవీ సూర్యనారాయణ ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాలూరు రూరల్ సీఐ రామకృష్ణ, మక్కువ ఎస్ఐ వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో సుమారు 150 మంది పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు బందోబస్తు నిర్వహించారు.